Cyclone Dana Effect : 'దానా' తుపాను నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యగా ఈస్ట్రన్ రైల్వే సీల్దా డివిజన్లో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ఏకంగా 190 లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే 14 రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తుపాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య కేంద్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం కోసం 17 నగరాలు/పట్టణాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 200 రైళ్ల సర్వీసులను రద్దు చేశారు లేదా దారిమళ్లించినట్లు సమాచారం.
![14 trains in SECR zone cancelled](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-10-2024/22746223_train1.jpg)
![14 trains in SECR zone cancelled](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-10-2024/22746223_train2.jpg)
సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది తరలింపు!
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం మధ్యలో ఒడిశాలోని భీతరకణికా నేషనల్ పార్క్, ధామ్రా పోర్టు మధ్య తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఆ సమయంలో అలలు 2 మీటర్ల మేర ఎగసిపడతాయనీ, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. దీనితో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఒడిశాలోని 14 జిల్లాల్లోని 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే 6000 సహాయక శిబిరాలను అధికారులు సిద్ధం చేశారు. పాలు, ఆహారం, వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి దానా తుపాను ఒడిశా తీరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. భారీ వర్షాల వల్ల కేంద్రపార, భద్రక్ , బాలాసోర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశముందని హెచ్చరించింది.
సర్వసన్నద్ధంగా సహాయక బృందాలు
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఇప్పటికే 19 ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఒడిశాకు చేరుకున్నాయి. ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కు చెందిన 51 బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. 178 అగ్నిమాపక బృందాలు, మరో 40 అదనపు సహాయ బృందాలను తుపాన్ ప్రభావిత జిల్లాల్లో మోహరించారు. తుపాను నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టాల నివారణకు చర్యలు చేపట్టింది.
భారీ వర్షాలు
బంగాల్లోని పలు జిలాల్లోనూ ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో 24, 25 తేదీల్లో తూర్పు రైల్వే, ఆగ్నేయ, దక్షిణ మధ్య రైల్వేలు 200కిపైగా రైళ్లను రద్దు చేశాయి. తుపాను కారణంగా జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారత తీర రక్షక దళం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్ట నివారణ చర్యలు చేపట్టింది. తుపాను నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. తుపానుకు భయపడవద్దని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పరీక్షలు రద్దు!
మరోవైపు, ఈ తుపానుతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 23వ తేదీ నుంచి 25 వరకు జరగాల్సిన పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. ఈ నెల 27న జరగాల్సిన ఒడిశా సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను సైతం వాయిదా వేశారు. కొత్త తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, ఈ నెల 24, 25 తేదీల్లో నందన్‌కానన్ జూ, బొటానికల్ గార్డెన్‌లకు సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించారు. అలాగే, నేటి నుంచి ఈనెల 25 వరకు సిమిలిపాల్ టైగర్ రిజర్వు, భిటార్కనిక జాతీయ పార్కులను మూసివేస్తున్నట్లు తెలిపారు. తుపాను సమయంలో మూగ జీవాలకు ఆశ్రయం కల్పించాలని మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి గోకులానంద మల్లిక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జంతువులు ఏవైనా గాయపడినట్లు గుర్తిస్తే 1962 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.