Delhi HC Female Wrestlers Security : భారత రెజ్లింగ్ సమాఖ్య-WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్‌కు వెంటనే భద్రతను పునరుద్ధరించాలని దిల్లీ కోర్టు గురువారం నగర పోలీసులను ఆదేశించింది. అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పూత్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంలో మహిళా రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని పేర్కొన్నారు.
ముగ్గురు రెజ్లర్లకు బుధవారం రాత్రి భద్రతను ఉపసంహరించుకున్నారని వారి తరఫున న్యాయవాది రెబెక్కా జాన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించుకోవడానికి గల కారణాలపై శుక్రవారంలోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.
కోర్టులో బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు సిద్ధంగా ఉన్న మహిళా రెజ్లర్ల భద్రతను పోలీసులు ఉపసంహరించుకున్నారని భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేష్ ఫోగాట ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ను దిల్లీ పోలీసులతో పాటు జాతీయ మహిళా కమిషన్, దిల్లీ కమిషన్‌కు ట్యాగ్ చేశారు.
जिन महिला पहलवानों की बृजभूषण के ख़िलाफ़ कोर्ट में गवाहियाँ होने वाली हैं, दिल्ली पुलिस ने उनकी सुरक्षा हटा ली है @DelhiPolice @DCWDelhi @NCWIndia
— Vinesh Phogat (@Phogat_Vinesh) August 22, 2024
క్లారిటీ ఇచ్చిన పోలీసులు!
భద్రత ఉపసంహరించారన్న రెజ్లర్ల ఆరోపణలపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. " రెజ్లర్లకు అందించిన భద్రతను ఉపసంహరించుకోలేదు. రెజ్లర్లు హరియాణాలో నివసిస్తారు కాబట్టి, భవిష్యత్తులో వారి భద్రత బాధ్యతను హరియాణా పోలీసులు నిర్వహించేలా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించాము. కానీ దీన్ని దిల్లీ పోలీసు PSOలు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని నివేదించడంలో ఆలస్యం చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితిని సరిదద్దాము. రెజ్లర్లకు సెక్యూరిటీ కంటిన్యూ అవుతుంది." అని న్యూదిల్లీ డీసీపీ ఎక్స్ వేదికగా తెలిపారు.
మెడల్ మిస్!
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఈ సారి ఎలాగైనా పతకం సాధించాలని పట్టుదలతో మంచి ప్రదర్శన చేస్తూ దూసుకెళ్లింది. దిగ్గజ రెజ్లర్ యుయి సుసాకినిపై విజయం సాధించడం వల్ల సంచలనం సృష్టించిన వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి మహిళా రెజ్లర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. కానీ చివరికి నిరాశే ఎదురైంది. ఫైనల్ ముందు అనూహ్యంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు నిర్వాహకులు. 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో బరిలో దిగిన ఆమె కేవలం 100 గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంతో డిస్ క్వాలిఫై చేశారు. దీన్ని సవాల్ చేస్తూ వినేశ్, కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (CAS)ను సంప్రదించింది. కానీ వినేశ్ అప్పీల్‌ను కాస్ కొట్టివేసింది.
రాజకీయాల్లోకి వినేశ్ ఫొగాట్! సోదరిపైనే పోటీ? - Vinesh Phogat Politics