Rahul Gandhi Lok Sabha Speech : రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి ఉండాలని వీడీ సావర్కర్ చెబితే ఇప్పుడు బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రక్షిస్తామని అనడం విడ్డూరంగా ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో రాహుల్ పాల్గొన్నారు. రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదనీ, దాని స్థానంలో మనుస్మృతి ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ చెప్పిన మాటలను రాహుల్ గుర్తు చేశారు.
#WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, Lok Sabha LoP Rahul Gandhi says, " ...i want to ask you (ruling side), do you stand by your leader's words? do you support your leader's words? because when you speak in parliament about… pic.twitter.com/QbJJBaBluj
— ANI (@ANI) December 14, 2024
ఏకలవ్యుడి బొటనవేలిని ద్రోణుడు నరికించినట్లే అదానీ, అంబానీ లాభం కోసం చిన్న వ్యాపారుల వేలిని బీజేపీ కత్తిరించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అగ్నివీర్, ప్రశ్నపత్రాల లీక్‌ల ద్వారా యువత బొటనవేలిని కత్తిరించారని మండిపడ్డారు. మద్దతుధర కోసం ఉద్యమిస్తున్న రైతుల బొటనావేలిని కత్తిరించారని దుయ్యబట్టారు. సామాజిక, ఆర్థిక సమానత్వం లేకుంటే రాజకీయ సమానత్వం ఉండదని అంబేడ్కర్ చెప్పారన్న రాహుల్, కులగణనతో సమానత్వం వైపు అడుగులేస్తామని తెలిపారు. మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారిత వివక్షను నిషేధించాలని రాజ్యాంగం చెబితే బీజేపీ మాత్రం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని తెలిపారు. మనుస్మృతి వంటి ప్రాచీన విధానాలతోనే దేశం నడవాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు.
#WATCH | During discussion on 75th anniversary of adoption of the Constitution of India, Lok Sabha LoP Rahul Gandhi says, " this is abhayamudra. confidence, strength and fearlessness come through skill, through thumb. these people are against this. the manner in which dronacharya… pic.twitter.com/nIropoeCfq
— ANI (@ANI) December 14, 2024
"రాజ్యాంగం గురించి, భారతదేశాన్ని ఎలా నడపాలని ఆర్‌ఎస్‌ఎస్ సుప్రీం లీడర్ సావర్కర్ భావించారో చెబుతూ నా ప్రసంగాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. "రాజ్యాంగంలో చెత్త విషయం ఏమిటంటే, దానిలో భారతీయత ఏమీ లేదు. మనుస్మృతి అనేది మన హిందూ దేశానికి వేదాల తర్వాత అత్యంత పూజనీయమైనది. మన ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతి, ఆచారాలు, ఆలోచనలు, ఆచరణలకు ఆధారమైంది." ఇవి సావర్కర్ చెప్పిన మాటలు. సావర్కర్ తన రచనల్లో మన రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగాన్ని మనుస్మృతితో భర్తీ చేయాలని ఆయన చెప్పారు. దానికి వ్యతిరేకంగానే మేం పోరాటం చేస్తున్నాం."
-- రాహుల్ గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత
మరోవైపు, భారత్‌లో అందరికీ సమాన ఓటు హక్కు ఉన్నప్పటికీ ఇక్కడ మైనారిటీలకు ఎలాంటి హక్కులు ఉండడం లేదని దుష్ప్రచారం చేయడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ విపక్షాలకు హితవు పలికారు. 75 ఏళ్ల రాజ్యాంగ ప్రస్తానంపై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో మాట్లాడిన రిజిజూ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌తోపాటు NDA ప్రభుత్వాలు కూడా ఎంతో కృషి చేశాయని చెప్పారు. ఇప్పుడు విపక్షాలు వారి వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠను దిగజార్చవద్దని హితవు పలికారు. భారత్‌లో మైనారిటీలకు చట్టబద్ధమైన భద్రత ఉందన్న మంత్రి ప్రభుత్వం ఆ నిబంధనకు కట్టుబడి ఉందని వివరించారు. ఐరోపా దేశాల్లో 48 శాతం మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు వివక్ష ఎదుర్కొంటున్నారని ఒక సర్వేలో తేలిందన్నారు. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో బుర్ఖాలు ధరించిన ముస్లింలపై అభ్యంతరం వ్యక్తం అవుతోందని గుర్తుచేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లోని సిక్కులు, హిందువులు, క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని వివరించారు.
#WATCH | In Lok Sabha, Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, " ...the former defence minister said in the rajya sabha that i am the defence minister of the country and i have no hesitation in saying that our congress government had set a policy that roads should… pic.twitter.com/bfWIDECEt2
— ANI (@ANI) December 14, 2024
"టిబెట్‌లో అయినా మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లో అయినా- మైనారిటీల పట్ల అణచివేత జరిగితే, వారికి ఏదైనా కష్టం వస్తే వారు రక్షణ పొందేందుకు మొదట వచ్చే దేశమేదైనా ఉందంటే అది భారతదేశమే. ఇది సురక్షితం కాబట్టే ఇక్కడకు వస్తారు. అలాంటప్పుడు ఈ దేశంలో మైనారిటీలకు భద్రత లేదని ఎలా అంటారు ? మైనారిటీ, మెజారిటీ వ్యక్తుల మధ్య, ప్రతీ ఇంట్లో ప్రతీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అంతమాత్రాన దేశ ప్రతిష్టను దెబ్బతీసే మాటలు మాట్లాడకూడదు. ఒక పార్టీ కోసం ఈ మాట చెప్పడం లేదు, దేశం కోసం చెబుతున్నా."
--కిరెన్ రిజిజూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి