Congress Party Manifesto : వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ప్రవేశపెట్టే మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత చర్చలను ముగించనుంది. నిరుద్యోగ సమస్యకు పరిష్కారమే లక్ష్యంగా అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రాం సహా మరికొన్ని వినూత్న కార్యాచరణలను ఎన్నికల ప్రణాళికలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సీడబ్ల్యూసీ ఆమోదమే తరువాయి
కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం సారథ్యం వహిస్తున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న మిగతా సీనియర్ నేతలు ప్రియాంకా గాంధీ వాద్రా, శశి థరూర్, ఆనంద్ శర్మ సహా మరికొందరు కీలక వ్యక్తులు ఉన్నారు. వీరంతా సమావేశమై అంతర్గత చర్చలను ముగించారు. మేనిఫెస్టో కమిటీ కీలక సభ్యులు మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాగా, మేనిఫెస్టో కమిటీ 50 పేజీల నివేదికను పార్టీ అధిష్ఠానానికి సమర్పించనుండగా కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి (సీడబ్ల్యూసీ) తుది ఆమోదం తెలపనుంది.
"మేము రూపొందించిన మేనిఫెస్టో కేవలం డ్రాఫ్ట్ మాత్రమే. ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముందుకు వెళ్తుంది. దీనిని సీడబ్ల్యూసీ ఆమోదించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ అధికారిక మేనిఫెస్టోగా మారుతుంది. ఇదే విషయమై పార్టీ అధ్యక్షుడితో పాటు మరికొందరు సీనియర్ నేతలను బుధవారం కలిసేందుకు అపాయింట్మెంట్ కోరనున్నాము."
- పి.చిదంబరం, కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు
-
#WATCH | Delhi: After the Congress meeting regarding the manifesto before the Lok Sabha elections, Congress leader P Chidambaram says, "We have prepared the draft manifesto. Now it will go to the CWC. They will finalize the manifesto. Tomorrow we will hand over this draft to the… pic.twitter.com/YQofG6oZbB
— ANI (@ANI) March 5, 2024
పేపర్ లీకు వీరులపై కఠిన చర్యలు
అయితే కాంగ్రెస్ తీసుకురానున్న ఈ మేనిఫెస్టోలో ప్రముఖంగా యువత-నిరుద్యోగంపైనే కమిటీ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. యువతీయువకుల జీవితానికి సంబంధించిన ఉద్యోగాల పరీక్షల నిర్వహణ విషయంలో ఎవరైనా పేపర్ లీకులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా కీలక అంశాలను తన మేనిఫెస్టోలో పొందుపర్చినట్లుగా తెలుస్తోంది. కాగా, ఇవే అంశాలను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లోని బదనవార్‌లో జరిగే బహిరంగ ర్యాలీలో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మార్చి 7న కాంగ్రెస్ తొలి జాబితా
ఇదిలాఉంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. అధికార బీజేపీ ఇప్పటికే 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ కూడా తన తొలి జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మార్చి 7న (గురువారం) భేటీ కానుంది. ఈ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఈ మీటింగ్ తర్వాతే తమ అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇంటి పైకప్పుపై బస్సు- సీట్లు, టీవీ, లైట్లు సైతం- ఎక్కడో తెలుసా?
ఆరు ట్రంకు పెట్టెల ఆభరణాల అప్పగింతపై హైకోర్టు స్టే- తనకే దక్కాలంటూ జయలలిత మేనకోడలు పిటిషన్