Upcoming Assembly Elections Congress : త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి రాణించిన హస్తం పార్టీ, ఇప్పుడు మహారాష్ట్ర, హరియాణాల్లో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. మహారాష్ట్రలో మిత్రపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లనున్న కాంగ్రెస్ హరియాణాలో మాత్రం ఒంటరి పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది చివర్లో ఈ రెండు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనుండగా ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.
గెలుపు గుర్రాల కోసం
ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల్లో విజయం తథ్యమని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. అందుకే ఇప్పటి నుంచే దానికి తగ్గ వ్యూహాలను రచిస్తోంది. మహారాష్ట్ర, హరియాణా శాసనసభలకు పోటీ చేసే ఆశావహుల నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించింది. నవంబర్‌లో జరిగే ఎన్నికల కోసం స్థానిక నేతలు, కార్యకర్తలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు నామమాత్రపు రుసుమును నిర్ణయించారు. సాధారణ వర్గాలకు చెందిన నేతలకూ రూ.20,000 రిజర్వ్‌డ్ కేటగిరీ వర్గాలకు చెందిన వారు రూ.5,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఇంత త్వరగా టికెట్లకు దరఖాస్తులు తీసుకుంటుండడంపై స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కష్టపడిన కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. దరఖాస్తు ఫీజు నామమాత్రమే అని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆశిష్ దువా తెలిపారు. కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో బలంగా ఉందని, ఈసారి విజయంపై తాము పూర్తి విశ్వాసంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి ఉమ్మడి వ్యూహాలు రచించి అధికారం చేపడతామని వెల్లడించారు. మహా వికాస్ అఘాడీలో భాగస్వాములైన శివసేన యూబీటీ, ఎన్‌సీపీ, ఎస్‌పీతో కలిసి కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆశిష్ దువా ధీమా వ్యక్తం చేశారు. మహా వికాస్ అఘాడీ నేతల కీలక సమావేశం త్వరలో నిర్వహిస్తామని తెలిపారు.
త్వరలో కూటమి భాగస్వామ్య పక్షాల జిల్లా స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన వెల్లడించారు. రైతుల సమస్యలు, మరాఠా రిజర్వేషన్లు, నిరుద్యోగం, అవినీతితో ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆరిఫ్ నసీన్ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయని, గెలిచే అభ్యర్థిని నిలబెట్టడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
హాథ్రస్ తొక్కిసలాట బాధితులకు రాహుల్ పరామర్శ- సాయం చేస్తానని హామీ - Hathras Stampede
రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్- ప్రతిపక్షనేత ప్రసంగంపై తీవ్ర దుమారం