Priyanka Gandhi Wayanad : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. రాహుల్ గాంధీ గెలిచి రాజీనామా చేసిన కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆమె పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ వెంటనే తమ పార్టీ అభ్యర్థిగా ప్రియాంక పోటీ చేస్తారని కాంగ్రెస్ ప్రకటించింది.
ప్రియాంక గెలిస్తే చట్టసభల్లోకి తొలిసారిగా అడుగుపెడతారు. అంతేకాదు ఒకేసారి ముగ్గురు గాంధీ కుటుంబ సభ్యులు చట్టసభల్లో ఉంటారు. ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. రాహుల్ లోక్‌సభ సభ్యుడు. ప్రియాంక గెలిస్తే ఆ కుటుంబం నుంచి మూడో వ్యక్తి అవుతారు. నవంబరు 13న వయనాడ్‌లో పోలింగ్ జరగనుంది. వయనాడ్‌తోపాటు మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికకు తమ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పాలక్కడ్, చెలక్కార (ఎస్సీ) అసెంబ్లీ స్థానాలకు రాహుల్ మమ్‌కూటథిల్, రమ్య హరిదాస్ బరిలో దిగినున్నట్లు వెల్లడించింది.
లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన రాహుల్ గాంధీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోనే కొనసాగాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేరళలోని వయనాడ్‌ను వదులుకున్నారు. అందుకే అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీని బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.