CISF Takes Over Parliament Security : ఇప్పటివరకు సీఆర్పీఎఫ్‌కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్(పీడీజీ)లోని 1400 మందికిపైగా సిబ్బంది మన పార్లమెంటుకు భద్రత కల్పించేవారు. ఇకపై ఈ విధులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) నిర్వర్తించనుంది. మే 20వ తేదీన (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి సీఐఎస్ఎఫ్‌కు చెందిన దాదాపు 3,317 మందికిపైగా సిబ్బంది మొత్తం పార్లమెంటు కాంప్లెక్సుకు పహారా కాయనున్నారు. గత శుక్రవారం పార్లమెంటు కాంప్లెక్సులోని పరిపాలన, కార్యాచరణ విభాగాలను సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు పీడీజీ కమాండర్ అప్పగించారు. దీంతో తమ ఆయుధాలు, వాహనాలు, కమాండోలను ఉపసంహరించుకునేందుకు పీడీజీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
గత 10 రోజులుగా జల్లెడ
సెంట్రల్ దిల్లీలో ఉన్న పార్లమెంటు కాంప్లెక్స్‌లో పాత పార్లమెంటు భవనం, కొత్త పార్లమెంటు భవనం, వాటి అనుబంధ నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటికి ఇకపై 3,317 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. పార్లమెంటు కాంప్లెక్సులోని అన్ని ఫ్లాప్ ఎంట్రీ గేట్‌లు, పోస్టెడ్ కెనైన్ స్క్వాడ్‌లు, ఫైర్ టెండర్లు, సీసీటీవీ మానిటరింగ్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, వాచ్ టవర్ వంటి విభాగాల్లో ఇప్పటికే సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులను మొదలుపెట్టారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది గత 10 రోజులుగా పార్లమెంటు కాంప్లెక్స్‌ను అణువణువూ జల్లెడ పడుతున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే
పార్లమెంటులో విధులు నిర్వర్తించే సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సఫారీ సూట్‌లు, లేత నీలం రంగు ఫుల్ స్లీవ్ షర్టులు, బ్రౌన్ ప్యాంట్‌లు యూనిఫామ్‌గా ఉంటాయి. పార్లమెంట్ డ్యూటీ గ్రూప్‌లో భాగంగా సేవలందించిన పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్ (పీఎస్ఎస్)ను భవిష్యత్తులోనూ పార్లమెంటు ప్రాంగణంలో మార్షల్ విధుల కోసం, లాబీల పహారాకు వినియోగించే అవకాశం ఉంది. కొంతమంది పీఎస్ఎస్ సిబ్బందిని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో భద్రత, ప్రోటోకాల్ విధుల కోసం మోహరించనున్నారు. పార్లమెంటు నుంచి సేవలను ఉపసంహరించుకోనున్న పార్లమెంట్ డ్యూటీ గ్రూపును సీఆర్పీఎఫ్ ఆరో బెటాలియన్‌కు చెందిన వీఐపీ భద్రతా విభాగంలో విలీనం చేయాలని యోచిస్తున్నారు. అయితే ఈ అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికనే సీఐఎస్ఎఫ్‌కు పార్లమెంటు భద్రతా విధులను అప్పగిస్తున్నారని, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని పూర్తిస్థాయి సేవల కోసం అప్‌గ్రేడ్ చేయనున్నారని తెలుస్తోంది.
2023 డిసెంబరు 13 ఘటనతో
గతేడాది డిసెంబర్ 13న పార్లమెంటు భద్రతా ఉల్లంఘన వ్యవహారంతో దేశంలో కలకలం రేగింది. పార్లమెంటు జీరో అవర్ టైంలో ఇద్దరు యువకులు పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకి ఎంపీలపైకి రంగుల పొగలను స్ప్రే చేస్తూ హల్‌చల్ చేశారు. అప్పట్లో పార్లమెంట్ కాంప్లెక్స్ భద్రతా సమస్యలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి సీఆర్పీఎఫ్ డీజీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 2001 సంవత్సరంలో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి జరిగిన టైంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఎనలేని సేవలు అందించారు. అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంటు భద్రతా విధుల నుంచి వైదొలగాల్సి వస్తుండటంపై సీఆర్పీఎఫ్ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.
'నికోబార్ దీవులకు నైరుతి రుతుపవనాలు- కేరళకు అప్పుడే' - Southwest Monsoon Update