How To Make Chicken Soup Recipe : చాలా మందికి వాతావరణం చల్లగా మారిన వేళ.. వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది. కాఫీ, టీ రొటీన్. కాబట్టి.. వెరైటీగా సూప్(Soup) జుర్రితే భలే ఉంటుంది! అలాంటి వారికోసం.. రుచి, కమ్మదనం, ఒంటికి వెచ్చదనంతోపాటు ఇమ్యూనిటీ పవర్ అందించే ఒక అద్భుతమైన నాన్‌వెజ్ సూప్ పట్టుకొచ్చాం. అదే.. నోరూరించే "చికెన్ సూప్". దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని తాగారంటే.. ఆహా ఏమి రుచీ అని పాడుకోవడం పక్కా! అంతేకాదు.. జలుబు, దగ్గుతో నోటికి ఏమీ రుచించనప్పుడు ఈ సూప్‌ని తాగితే.. వెంటనే రిలీఫ్ లభిస్తుందంటున్నారు నిపుణులు. మరి.. ఈ చికెన్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- చికెన్ - 200 గ్రాములు(విత్ బోన్స్)
- నెయ్యి/నూనె - 2 టీస్పూన్లు
- లవంగాలు - 3
- యాలకులు - 2
- బిర్యానీ ఆకు - 1
- దాల్చిన చెక్క - 1
- ఉల్లిపాయలు - 2
- పసుపు - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- అల్లం - కొద్దిగా
- వెల్లుల్లి రెబ్బలు - 10
- మిరియాలు - 1 టీస్పూన్
- నిమ్మరసం - కొద్దిగా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- వాటర్ - తగినంత
తయారీ విధానం :
- ముందుగా ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చికెన్(Chicken) శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి.
- కొత్తిమీర మిశ్రమం కోసం.. మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా తురుముకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర తురుము కొద్దిగా, తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మీరు కావాలనుకుంటే.. ఒక టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు చికెన్ సూప్ కోసం.. స్టౌపై కుక్కర్ పెట్టుకొని నెయ్యి పోసుకోవాలి. అది కరిగాక చిన్న బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలతో పాటు యాలకులను కాస్త ఓపెన్ చేసి వేసుకోవాలి.
- ఆపై వాటిని కాసేపు వేయించుకొని సన్నగా తురుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి కాస్త మెత్తగా మారేవరకు వేయించుకోవాలి. అయితే, ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే కొద్దిగా పుదీనా తరుగు వేసుకోండి. ఇలా వేయడం వల్ల సూప్ టేస్ట్ పెరుగుతుంది.
- ఉల్లిపాయ ముక్కలు వేగాక.. అందులో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని స్టౌ మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అలా చికెన్ వేయించుకునేటప్పుడే ఆ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి.
- చికెన్ వేగిందనుకున్నాక.. ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మరికొద్దిసేపు ఆ మిశ్రమాన్ని మగ్గనివ్వాలి. అలా చేయడం ద్వారా ఇంగ్రీడియంట్స్ పచ్చివాసన పోతుంది.
- అనంతరం రెండు గ్లాసుల వాటర్‌ను ఆ మిశ్రమంలో పోసుకోవాలి. అదేవిధంగా ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. అలాగే ఓసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని.. చాలకుంటే కాస్త వేసుకోవాలి.
- ఇప్పుడు.. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మిశ్రమాన్ని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి చూడండి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ రెడీ!
ఇవీ చదవండి :
వర్షాకాలంలో జలుబు, దగ్గు వేధిస్తుంటే - ఘాటుగా అల్లం చారు చేసుకోండి! - వెంటనే క్లియర్ అయిపోతుంది!
5 నిమిషాల్లో అద్దిరిపోయే మిరియాల చారు - సీజనల్ జ్వరాలకు సూపర్ రెమిడీ!