Chhattisgarh Fire Accident : ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్ కోట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థకు సంబంధించిన గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పెద్దఎత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. మంటలు భారీగా ఎగసిపడటం వల్ల రాయ్‌పుర్ కోట పరిసర ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. 7 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది శ్రమించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. కాగా ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.
పరిసర ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ
మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కంపెనీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ కంపెనీలో సుమారు 5 వేల ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నట్లు సమాచారం. వీటిలో ఇప్పటికే వందల ట్రన్స్‌ఫార్మర్లు కాలి బూడిదయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదస్థలంలో ఉన్న అయిల్ డబ్బాలను మంటలకు దూరంగా తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి సమీపంలోనే 132 కేవీ సబ్‌స్టేషన్ ఉండడం వల్ల అక్కడికి మంటలు వ్యాపించకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఒకవేళ అక్కడికి మంటలు వ్యాపిస్తే నగరవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
వాణిజ్య సముదాయంలో భారీ అగ్నిప్రమాదం
Bengaluru Fire Accident Today : కర్ణాటక బెంగళూరులోని ఓ వాణిజ్య సముదాయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులోని ఓ ఆయుర్వేద ఉత్పత్తుల దుకాణంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశాయి. ఈ సమయంలో దుకాణంలో సుమారు 20మంది ఉద్యోగులు ఉండగా వారిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 25 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని వివరించారు. భారీగా మంటలు ఎగసిపడటం వల్ల పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది.