Chennai To Bengaluru Hyperloop Train : 'హైపర్ లూప్' టెక్నాలజీతో రవాణా రంగంలో మరో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. ఈ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి ఐఐటీ చెన్నైలోని తైయూర్ క్యాంపస్‌లో, 425 మీటర్ల పొడవైన హైపర్‌లూప్ ట్యూబ్‌ను నిర్మించారు. అదే క్యాంపస్ వేదికగా 2025 సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ వరకు 'హైపర్ లూప్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లు' జరగబోతున్నాయి. ఈవివరాలను ఐఐటీ చెన్నై డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి వెల్లడించారు. ఇంతకీ ఏమిటీ హైపర్ లూప్ టెక్నాలజీ? ఐఐటీ చెన్నై క్యాంపస్‌లో ఆ ట్యూబ్‌ను ఎలా నిర్మించారు? 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐఐటీ చెన్నై డైరెక్టర్ చెప్పిన వివరాలివీ.
'ఆవిష్కార్ హైపర్‌లూప్'లో 76 మంది విద్యార్థులు
ఐఐటీ చెన్నైకు చెందిన విద్యార్థుల బృందం 'ఆవిష్కార్ హైపర్‌లూప్' పేరుతో ఒక టీమ్‌గా ఏర్పడి హైపర్‌లూప్ ట్యూబ్‌ను తైయూర్ క్యాంపస్‌లో నిర్మించారని ఐఐటీ చెన్నై డైరెక్టర్ కామకోటి తెలిపారు. ఈ రీసెర్చ్ టీమ్‌లో 11 వివిధ కోర్సులకు చెందిన 76 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, పీజీ స్టూడెంట్లు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. హైపర్‌లూప్ ట్రాక్ ఏయే దశలో ఎలా ఉండాలి అనేది ఈ విద్యార్థులే డిజైన్ చేశారని కామకోటి వెల్లడించారు.
హైపర్‌లూప్ ట్యూబ్‌లో 'లూప్' అనే కీలక భాగం ఉంటుంది. లూప్ అంటే అత్యల్ప గాలి పీడనంతో కూడిన ట్యూబ్ లాంటి నిర్మాణం. 'పాడ్' అనే మరో భాగం ఉంటుంది. పాడ్ అంటే, రైలు బోగీ లాంటి వాహనం. ఇక 'టెర్మినల్' అంటే హైపర్ లూప్ బోగీలు ఆగే ప్రదేశం.
గరుడతో ట్రయల్ రన్
ఆవిష్కార్ హైపర్‌లూప్ టీమ్‌లోని స్టూడెంట్స్ మూడు దశల్లో ఒక హైపర్‌లూప్ బోగీని తయారు చేశారని, దానికి 'గరుడ' అని పేరు పెట్టారని ఐఐటీ చెన్నై డైరెక్టర్ వివరించారు. గరుడ అనే బోగీతో ట్రయల్ రన్ కోసం ఆసియా ఖండంలోనే అతి పొడవైన(425 మీటర్ల) హైపర్ లూప్ ట్యూబ్‌ను రెడీ చేశామని కామకోటి వెల్లడించారు. "ట్రయల్ రన్‌లో భాగంగా హైపర్‌లూప్ బోగీని 4 దశల్లో పరీక్షిస్తాం. హైపర్‌లూప్ ట్యూబ్ దిగువ భాగాన్ని బోగీ (గరుడ) తాకి ఉంటే అది వేగంగా ముందుకు సాగలేదు. అందుకే దాన్ని ఒక ఇంచుపైకి లేపుతాం. అప్పుడది చాలా వేగంగా వెళ్లగలుగుతుంది. సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకంగా ఉంటుంది. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యంకాదు. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్‌లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. మేం ట్రయల్ రన్‌లో చేయబోయేది అదే" అని కామకోటి తెలిపారు. అంతేకాకుండా ఈ రిసెర్చ్ ప్లాట్‌ఫామ్‌కు భారతీయ రైల్వే, ఎల్ అండ్ టీ ఫండింగ్ చేస్తోందని చెప్పారు.
"తక్కువ గాలిపీడనం ఉండటం, మ్యాగ్నెటిక్ బలం తోడు కావడం వల్ల హైపర్‌లూప్ బోగీ గంటకు దాదాపు 500 కిలో మీటర్లు నుంచి 600 కిలో మీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యాక హైపర్‌లూప్ బోగీలో మేం సరుకులను రవాణా చేసి చెక్ చేస్తాం. అది కూడా సఫలమైతే చివరగా హైపర్‌లూప్ బోగీల్లో మనుషులను కూర్చోబెట్టి ట్రయల్స్ నిర్వహిస్తాం" అని ఐఐటీ చెన్నై డైరెక్టర్ వెల్లడించారు. ఒకవేళ ఈ టెక్నాలజీ నిజ జీవితంలో అందుబాటులోకి వస్తే రైలు గాల్లో(హైపర్ లూప్ ట్యూబ్) ప్రయాణించి చెన్నై నుంచి బెంగళూరుకు 30 నిమిషాల్లోనే చేరుకుంటుందు" అని " అని కామకోటి వివరించారు.
తగ్గిన 'వందేభారత్' స్పీడ్- గంటకు 76 కిలోమీటర్లే! - What Is Vande Bharat Train Speed