Cheetah Cubs Born In Kuno National Park : మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ ఉద్యానవనంలో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 5 ఏళ్ల గామిని అనే చీతా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్మీడియాలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ వెల్లడించారు. ఈ ఐదు కూనల జననంతో భారత్‌లో మొత్తం చీతాల సంఖ్య 26కు చేరిందని తెలిపారు. కూనలకు సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశారు. కాగా, భారత గడ్డపై చీతాలు పిల్లలకు జన్మనివ్వడం ఇది నాలుగోసారి.
భారత గడ్డపై 13 చీతా కూనల జననం
తాజాగా పుట్టిన వాటితో కలుపుకొని మొత్తం 13 చీతా పిల్లలు భారత్‌లో జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బందికి, పశువైద్యులకు కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు. గామిని వారసత్వం దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చిలో జ్వాలా అనే చీతా ఒకే కాన్పులో 4 కూనలకు జన్మనివ్వగా అందులో ఒకటి మాత్రమే బతికింది. ఈ ఏడాది అదే చీతా జనవరిలో రెండోసారి 4 కూనలకు జన్మనిచ్చింది. అనంతరం ఆశ అనే చీతా 3 కూనలను జన్మనిచ్చింది.
'ప్రాజెక్టు చీతా'
'ప్రాజెక్టు చీతా' ద్వారా 74 ఏళ్ల తర్వాత దేశంలోకి మళ్లీ చీతాలు ప్రవేశించాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. అందుకే భారత ప్రభుత్వం 'ప్రాజెక్టు చీతా' కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందులో భాగంగా 2022 సెప్టెంబర్ 17న ఎనిమిది నమీబియన్ చీతాలను అధికారులు మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కుకు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. అనంతరం 2023 ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తెప్పించారు. ఈ సమూహంలోనే గామిని కూడా వచ్చింది. గతేడాది మార్చి నుంచి భారత్‌లో 10 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. కాగా, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని చీతాలను రప్పించాలని ప్రణాళికలనూ రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.
ఒక్క నిమ్మకాయ ధర రూ.35వేలు!- స్పెషల్ ఏంటంటే?
'ఉక్రెయిన్పై రష్యా అణుదాడిని అడ్డుకోవడంలో మోదీదే ముఖ్యపాత్ర!'