Kolkata Murder Incident : కోల్‌కతా హత్యాచార ఘటన నేపథ్యంలో బంగాల్ ప్రభుత్వం ఉద్యోగినిల భద్రత కోసం ఉపక్రమించింది!. అనేక చర్యలను ప్రకటించింది. రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వర్తించే మహిళల కోసం, ముఖ్యంగా ప్రభుత్వం ఆస్పత్రుల్లో పని చేసే మహిళల కోసం ప్రత్యేక రిటైరింగ్ గదులు, సీసీటీవీలు ఉండే సేఫ్‌జోన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, హాస్టళ్లు, మహిళలకు రాత్రి షిఫ్టులు ఉండే ఇతర పని ప్రదేశాల్లో 'హెల్పర్స్ ఆఫ్ ది నైట్' పేరుతో వాలంటీర్లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది.
ఎమర్జెన్సీ సమయాల్లో ఉపయోగించే స్పెషల్ యాప్
రాష్ట్రంలో రాత్రిళ్లు విస్తృతంగా ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పోలీసు పెట్రోలింగ్‌ను పెంచుతామని వెల్లడించింది. ఎమర్జెన్సీ సమయాల్లో స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం చేరవేసేందుకు మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ ఒంటరిగా కాకుండా ఇద్దరు మహిళలకు కలిపి నైట్ షిఫ్టులు వేయాలని సూచించింది.
'ప్రతి రెండు గంటలకు అప్డేట్ ఇవ్వండి'- రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
కోల్‌కతా హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లోని శాంతిభద్రతల పరిస్థితులను తమకు సమర్పించాలని అన్ని రాష్ట్రాల పోలీసులను కేంద్రం ఆదేశించింది.
ఆయా రాష్ట్రాల్లో నిరంతరం శాంతి భద్రతల పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని ప్రతీ 2 గంటలకు ఒకసారి దిల్లీలోని కేంద్ర హోంశాఖ కంట్రోల్‌రూమ్‌కు ఫ్యాక్స్, వాట్సాప్, లేదా ఈమెయిల్ ద్వారా చేరవేయాలని నిర్దేశించింది. ఈ ఆదేశాలు ఇవాళ్టి నుంచి 1600 గంటలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఓ వాలంటీర్ దారుణ హత్యాచారానికి పాల్పడ్డ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు చేస్తున్నారు. ఇలాంటి మరో ఘటన జరక్కుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఆస్పత్రులను సేఫ్‌జోన్లుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు.
ఆర్‌జీ కర్ ఆస్పత్రి పరిసరాల్లో ధర్నాలు, ర్యాలీలకు నో పర్మిషన్
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌పై ఆందోళన కారులు దాడి చేసి ఆసుపత్రిని ధ్వంసం చేసిన నేపథ్యంలో బంగాల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్జీ కర్ హాస్పిటల్ చుట్టూ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత చట్టంలోని 163 సెక్షన్ అమలు చేశారు. ఆదివారం(2024 ఆగస్టు 18) నుంచి 7 రోజుల పాటు ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలను అనుమతించరు.