Kolkata Doctor Case : బంగాల్‌లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని విచారణలో సీబీఐ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిందితుడు సంజయ్‌రాయ్ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధరించినట్లు పేర్కొన్నాయి.
కేసు దర్యాప్తు కూడా తుది దశకు చేరుకుందని, త్వరలో కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయనుందని తెలిపాయి. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను నిందితుడి డీఎన్ఏతో సరిపోల్చడానికి సీబీఐ వాటిని దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన నిపుణులకు పంపించినట్లు వెల్లడించాయి. ఎయిమ్స్ వైద్యుల నుంచి నివేదిక రాగానే సీబీఐ దర్యాప్తును పూర్తి చేయనుందని తెలిపాయి. ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు వందకుపైగా వాంగ్మూలాలను, 10 లై డిటెక్టర్ పరీక్షలను నిర్వహించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
సీబీఐపై బంగాల్ సర్కార్ ఒత్తిడి
అయితే కేసు దర్యాప్తుపై బంగాల్ ప్రభుత్వం నుంచి సీబీఐ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బాధితురాలికి న్యాయం అందించాలనే ఉద్దేశం సీబీఐకి లేదని ఇటీవల బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఆరోపించారు. దర్యాప్తును కావాలనే ఆలస్యం చేస్తున్నారని అన్నారు. దర్యాప్తు చేపట్టి 20 రోజులు దాటినా ఇప్పటి వరకు కేసు పురోగతి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి తాము ఐదు రోజుల సమయం అడిగామని గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేశారని తెలిపారు.
ఆర్జీ కర్ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారం జరగగా సివిల్ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించగా పలు అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సీబీఐ సేకరించింది. ఘటన జరిగిన సమయంలో నిందితుడు ఆ బిల్డింగ్‌లో తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించింది.
సుప్రీంలో చుక్కెదురు
మరోవైపు, ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కాలేజీలో ఆర్థిక అవకతవకల అభియోగాలకు సంబంధించి తనపై సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన భారత సర్వోన్నత న్యాయస్థానం సందీప్ ఘోష్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
'పోలీసులు లంచం ఇవ్వాలనుకున్నారు!' కోల్‌కతా డాక్టర్ ఫ్యామిలీ సంచలన ఆరోపణలు - Kolkata Doctor Case
కోల్‌కతా CP రాజీనామా చేయాలని డాక్టర్ల డిమాండ్- రాత్రంగా రోడ్డుపైనే నిరసన! - Kolkata Doctor Case