CAA Rules Notified : సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం- 2019 CAAను అమల్లోకి తెస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం సాయంత్రం నోటిఫై చేసింది. ఈ చట్టం విధివిధానాలు, అమలు నిబంధనలను వెల్లడించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత చట్టం వాస్తవ రూపంలోకి వచ్చింది. ఫలితంగా త్వరలోనే భారత పౌరసత్వ జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
"నిబంధనలు ఇప్పటికే రూపొందించాం. ఈ ప్రక్రియను చేపట్టడానికి ఒక ఆన్లైన్ పోర్టల్‌ను సైతం తయారు చేశాం. ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లోకి అడుగు పెట్టిన వారు వచ్చిన ఏడాదిని చెబితే సరిపోతుంది. దరఖాస్తుదారులు మరే ఇతర పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది."
--కేంద్ర హోంశాఖ అధికారులు
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంటే ఏంటి? పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
నాలుగేళ్ల తర్వాత వాస్తవ రూపంలోకి
CAA చట్టం 2019 డిసెంబరులో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ, ఇంతవరకు దీనిపై నిబంధనలు రూపొందించకపోవడం వల్ల ఈ చట్టం అమల్లోకి రాలేదు. పార్లమెంట్ నిబంధనల ప్రకారం, ఓ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆరు నెలల లోపు విధివిధానాలు రూపొందించాల్సి ఉంటుంది. అలా కుదరని పక్షంలో గడువును పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభలోని కమిటీల అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో 2020 నుంచి తరుచుగా గడువు పెంపునకు అనుమతిని తీసుకుంటుంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందే 2019లో రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితం తెలిపారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ ముస్లింలను తప్పుదారి పట్టిస్తూ, సీఏఏకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లో హింసను ఎదుర్కొని భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే సీఏఏ అమలవుతోందన్నారు. ఇది ఎవరి భారత పౌరసత్వాన్నీ లాక్కోవడానికి కాదని తెలిపారు.