CAA Citizenship Certificates Issued : లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నవారికి తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లా దిల్లీలో వారికి సీఏఏ కింద జారీ అయిన పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు.
అయితే పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు అందుకున్న పలువురు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. "నేను 2013 నుంచి భారత్‌లో ఉంటున్నాను. పాకిస్థాన్ నుంచి వచ్చాను. పౌరసత్వం లభించనందున నా పరిస్థితి మెరుగపడనుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నా పిల్లలు ఇక్కడ చదువుకోగలుగుతారు. భారత్‌తోపాటు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు" అని యశోద అనే మహిళ తెలిపింది.
"నేను 2014లో దిల్లీకి వచ్చాను. అంతకుముందు నేను గుజరాత్‌లో 4 సంవత్సరాలు ఉన్నాను. నాకు ఇప్పుడు పౌరసత్వం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. సర్టిఫికెట్స్ లేని కారణంగా నేను చదువుకోలేకపోయాను. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు నా పిల్లలు చదువుకోగలుగుతారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను"
- అర్జున్, పౌరసత్వ ధ్రువీకరణ పత్రం పొందిన దరఖాస్తుదారుడు.
పాకిస్థాన్‌లో అమ్మాయిలు చదువకోలేరని, బయటకు వెళ్లడం కష్టమని ధ్రువీకరణ పత్రం అందుకున్న భావన అనే యువతి తెలిపింది. "నేను ఈరోజు పౌరసత్వం పొందాను. అందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను మరింత చదువుకోవచ్చు. నేను 2014లో ఇక్కడకు వచ్చాను. CAA అమల్లోకి వచ్చినప్పుడు సంతోషించాను. పాకిస్థాన్‌లో ఆడపిల్లలు చదువుకోలేం. బయటికి వెళ్లడం కష్టం. ఒకవేళ వెళ్లాలంటే బురఖా వేసుకుని వెళ్లేవాళ్లం. నేను ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్నాను" అని చెప్పింది.
-
#WATCH | Bhavna, one of the applicants who received citizenship certificate says, " I have got the citizenship today and I am feeling very happy, I can study further...I came here in 2014, and I was very happy when this (CAA) was passed...in Pakistan, we girls couldn't study and… https://t.co/HUmw3HqPzG pic.twitter.com/1tZrc8BoFF
— ANI (@ANI) May 15, 2024
దేశంలో సీఏఏ అమలుపై ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినంది. 2019 డిసెంబర్‌లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందగా దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. సీఏఏ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్రం నిబంధనల్ని రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది.