Building Collapse In Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం కుప్పకూలగా, శిథిలాల కింద 25 మంది కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఉన్న పలువురు కార్మికులను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఒకరు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు హైఅలర్ట్!
జిల్లాలోని జనసత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం భవనంలో కార్మికులు పనిచేస్తుండగా పైకప్పు కుప్పకూలింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, జేసీబీలను రప్పించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది.
ఘటనాస్థలికి సీఎం
ముజఫర్‌నగర్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం యోగి ఆదేశాల మేరకు ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
"జనసత్‌లో భవనం కూలిపోవడం వల్ల శిథిలాల కింద 22-25 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 11 మందిని రక్షించగా, వారంతా చికిత్స పొందుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నందున అధికారులంతా ఇక్కడే ఉన్నారు" అని ముజఫర్‌నగర్ డీఎం అరవింద్ మల్లప్ప బంగారి తెలిపారు.
ఇటీవల బంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలి నలుగురు మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. 'ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వలేదు. ఈ భవన నిర్మాణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై దర్యాప్తును చేపట్టారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి పరిహారం అందిస్తాం. ఈ ఘటన వల్ల సమీపంలో ఉన్న ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వారికి కూడా సహాయం చేస్తుంది' అని మమతా బెనర్జీ తెలిపారు.