BS Yediyurappa POCSO Case : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ (54) ఆస్పత్రిలో మరణించింది. ఏడాదిన్నరగా లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతోందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆదివారం రాత్రి మహిళ ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందతూ మరణించారని పోలీసులు తెలిపారు.
ఇది జరిగింది
మార్చిలో బీఎస్ యడియూరప్ప తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఓ మోసం కేసులో సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు యడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే తనకు ప్రాణ హాని ఉందని మహిళ పేర్కొంది. దీంతో మహిళకి పోలీసు భద్రత కల్పించారు. షిఫ్ట్ ప్రకారం 24 గంటలూ మహిళ ఇంటి దగ్గర ఇద్దరు సెక్యూరిటీ గార్డులను మోహరించారు.
అదే సమయంలో మహిళ చేసిన ఆరోపణలపై యడియూరప్ప స్పందించారు. 'కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తనకు సమస్య ఉందంటూ నా ఇంటికి వచ్చింది. దీనిపై ఆరా తీసి, ఆమెకు సాయం చేయాలని పోలీస్ కమిషనర్‌కు చెప్పాను. ఆ తర్వాత ఆమె నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చాను. అయితే నాపై కేసు పెట్టింది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. దీని వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఇప్పుడే చెప్పలేను' అంటూ యడుయూరప్ప అన్నారు. అయితే ఆయన కార్యాలయం సైతం వీటిని ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపింది. వారు ఇప్పటివరకు 53 ఫిర్యాదులు చేశారంటూ ఆ జాబితాను విడుదల చేసింది.