BJP Suresh Gopi About Indira Gandhi : మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా' అని సంబోధించిన కేంద్ర మంత్రి, కేరళ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి తన వ్యాఖ్యలపై ఆదివారం క్లారిటీ ఇచ్చారు. తాను దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇందిరా గాంధీని అమ్మగా అభివర్ణించానని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని తెలిపారు. తాను మనస్ఫూర్తిగా మాట్లాడే వ్యక్తినన్న సురేశ్ గోపి, ఇందిరా గాంధీ గురించి తాను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని అన్నారు. ఈ మేరకు ఆయన తిరువనంతరపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
"నేను ఏం చెప్పాను? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే, కేరళలో ఆ పార్టీ పితామహుడు కే కరుణాకరణ్. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇందిరా గాంధీ తల్లి లాంటివారు. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్పాను. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి చనిపోయే వరకు భారత్‌కు ఇందిరా గాంధీ నిజమైన ఆర్కిటెక్ట్. నేను ఆమె గురించి ఈ విషయాలను ఎలాగైనా చెప్పాలి. విపక్ష పార్టీకి చెందిన నాయకురాలు అయినంత మాత్రాన దేశం కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని నేను మరచిపోలేను. ఇక కరుణాకరణ్‌ను కేరళలో కాంగ్రెస్‌కు పితామహుడు అనడం, ఆ పార్టీ వ్యవస్థాపకులను, సహ వ్యవస్థాపకులను అగౌర పరిచినట్లు కాదు" అని తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు సురేశ్ గోపి.
ఇదీ జరిగింది
త్రిస్సూర్‌లోని దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కే కరుణాకరణ్ మెమోరియల్‌ను శనివారం కేంద్ర మంత్రి సురేశ్ గోపి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా' (మలయాళంలో 'భరతత్తింటే మాతవు') అని, కరుణాకరణ్‌ను ధైర్యవంతమైన పరిపాలకుడు, కేరళలో కాంగ్రెస్ పార్టీ పితామహుడు అని అభివర్ణించారు. కరుణాకరణ్, మార్కిస్ట్ నాయకుడు ఈకే నాయనార్ను తన రాజకీయ గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించాయి. ఈ కారణంగా తాజాగా సురేశ్ గోపి క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో త్రిస్సూర్ లోక్‌సభ స్థానం నుంచి సురేశ్ గోపి విజయం సాధించారు. సీపీఐ నేత వీఎస్ సునీల్‌కుమార్‌పై 74 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. సురేశ్ గోపికి 4.12 లక్షల ఓట్లు రాగా, సునీల్ కుమార్‌కు 3.37 లక్షల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నేత కె మురళీధరన్‌కు 3.28 లక్షల ఓట్లు పోలయ్యాయి.
నా పొలిటికల్ జర్నీ స్టార్ట్- 2026లో వచ్చేది ఆ ప్రభుత్వమే: శశికళ