BJP Multi Lingual Candidate In Kerala : రాజకీయాల్లో రాణించాలంటే ఎదుటివారిని ఆకర్షించాలి. మంచి భాషతో మనసులు దోచుకొనేవారు ఏ రంగంలో అయినా త్వరగా పైమెట్టుకు వెళతారు. ఇక రాజకీయ రంగంలో అయితే సరే సరి. అప్పట్లో 16 భాషలు తెలిసిన పీవీ నరసింహారావు మన తెలుగువారే. అయితే అలా బహుభాషలతో ఆకట్టుకునే మహిళలు తక్కువ. కానీ ఇప్పుడు ఒక మామూలు టీచర్ అయిన ఓ మహిళ తనకు వచ్చిన ఆరు భాషల వల్లే సామాన్య జనంలో చొచ్చుకుపోతూ బీజేపీ అధినాయకత్వాన్ని మెప్పించారు. ఎంతగా అంటే కేరళలో మహామహులు పోటీపడిన కాసర్‌గోడ్ పార్లమెంట్ స్థానానికి పార్టీ ఆమెనే నిలబెట్టేటంతగా.
చాలా కాలంగా వామపక్షాలకు కంచుకోటగా ఉన్న కాసరగోడ్ నియోజకవర్గంలో ఎంఎల్ అశ్విని(38) బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, అశ్వినినే బీజేపీ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. అందుకు ప్రధాన కారణం అశ్వినికి ఆరు భాషలపై ఉన్న పట్టు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్‌లో అశ్విని అనర్గళంగా మాట్లాడగలరు. ఆ ప్రతిభే ఆమె ఓటర్లతో మెరుగ్గా కనెక్ట్ కావడానికి సహాయపడుతుందని అధిష్ఠానం నమ్ముతోంది.
ఎవరీ అశ్విని?
ఎంఎల్ అశ్విని ఒక మామూలు స్కూల్ టీచర్. ఆమె గ్రామం మంజేశ్వరకు కేవలం బ్లాక్ పంచాయతీ మెంబర్. పార్టీలో మహిళా మోర్చా జాతీయస్థాయి సభ్యురాలు. అయినా సరే పార్టీ అధిష్ఠానం ఆమెకు పట్టం కట్టింది. కాసరగోడ్‌లో లోక్‌సభ బరిలో నిలిపింది. దానికి కారణం ఆమెకు తెలిసిన ఆరు భాషలు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్.
కన్నడ మాతృ భాషగా బెంగళూరులో పుట్టి పెరిగిన అశ్విని కాసరగోడ్‌కు కోడలుగా వచ్చింది. చిన్నప్పటినుంచే ఇంగ్లీష్, హిందీ మీద పట్టున్న ఆమెకు భాషలు నేర్చుకోవటం ఇష్టం. దీంతో చుట్టుపక్కల కుటుంబాల నుంచి తుళు నేర్చుకుంది. తరువాత తమిళం, మరి కొంతకాలం తరువాత మలయాళం మీద పట్టు పెంచుకుంది. కుటుంబసభ్యులతో ఒక్కొక్కరితో ఒక్కో భాష మాట్లాడి సాధన చేసే అశ్వినికి ఆమె భాషా పరిజ్ఞానం మేలే చేసింది.
బీజేపీలో చేరాక
స్కూలు టీచర్ ఉద్యోగం మానేసి బీజేపీలో చేరాక ఆమెకు మహిళా మోర్చాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పార్టీ స్థానం ఇచ్చింది. అంతే కాదు దిల్లీ కేంద్రంగా దాదాపు 10 రాష్ట్రాల్లో మహిళా మోర్చా సభ్యులతో కార్యకలాపాలు సాగించే బాధ్యత ఆమెకు అప్పగించింది. అక్కడ ఆమెకు భాష ఒక ఆయుధంగా మారింది.
కేరళ నుంచి వచ్చిన నాయకులు మలయాళం లేదా తమిళం వంటి భాషలు అనర్గళంగా మాట్లాడతారు. ఇంగ్లిష్, హిందీ పూర్తిగా రావు. కానీ అశ్వినికి ఆ భాషలు రావటం ఎంతో ఉపయోగంగా మారింది. మహిళా మోర్చా తరఫున జమ్ముకశ్మీర్‌తో మొదలు ఉత్తరప్రదేశ్, అసోం వరకు ఆమె పని చేసినప్పుడు, కింది స్థాయి కార్యకర్తలతో వాళ్లకు తెలిసిన భాషల్లో మాట్లాడుతూ సులువుగా కలిసిపోవడం పార్టీ గమనించింది. కాసరగోడ్‌లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ భాషీయులతో ఆమె అలవోకగా మాట్లాడటం, కొద్ది సమయంలోనే వారితో మంచి బంధాన్ని ఏర్పరచుకోవడం పార్టీ దృష్టికి వచ్చింది. అందుకే జిల్లా అధ్యక్షుడు రావిష్ తంత్రి, జాతీయ ప్రతినిధీ సీనియర్ నేత అయిన పీకే కృష్ణదాస్‌ను కాదని పార్టీ అశ్వినికి సీటు ఇచ్చింది.
కాసరగోడ్ లోక్‌సభ నియోజకవర్గం మంజేశ్వరం, కాసరగోడ్, ఉద్మా, కన్హంగాడ్, త్రికరిపుర్ సమీపంలోని కన్నూర్ జిల్లాలోని పయ్యనూర్, కల్లియస్సేరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాసరగోడ్‌లో బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.
జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ పాలన- తొలిసారి అధికారిక ఉత్తర్వులు జారీ - kejriwal issue order from jail