BJP Manifesto 2024 Lok Sabha : కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అధికార బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ప్రజల వద్ద నుంచి ఎన్నికల మేనిఫెస్టోకు సలహాలు స్వీకరించేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. 'వికసిత్ భారత్ మోదీ కీ గ్యారంటీ' అనే పేరుతో ఏర్పాటు చేసిన వాహనాలను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలు దేశంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించి సలహాలను స్వీకరించనున్నాయి.
మేనిఫెస్టో సలహాలు స్వీకరించడమే కాకుండా, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తాయని నడ్డా వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టడానికి మోదీకి ఉన్న దార్శనికతను ఇవి వివరిస్తాయని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేయడమే తమ ఉద్దేశమని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం మేనిఫెస్టో రూపకల్పన జరగుతోందని వివరించారు. మార్చి 15 నాటికి ప్రజల వద్ద నుంచి సుమారు కోటి సలహాలు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఈ సంకల్ప పత్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
మేనిఫెస్టో కమిటీ భేటీ
మరోవైపు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సైతం దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అన్ని రాష్ట్రాల నుంచి హాజరైన నేతల వద్ద ఈ కమిటీ సలహాలను తీసుకుంది.
ఐదు రాష్ట్రాల కోర్ కమిటీ మీటింగ్
అంతకుముందు శనివారం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల కోర్ కమిటీ నేతల సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోశ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు నేతలు హాజరయ్యారు.
బీజేపీ నయా స్కెచ్- నోటిఫికేషన్‌కు ముందే 100 మంది అభ్యర్థులతో తొలి జాబితా- మోదీ, షా సైతం!
బీజేపీ మిషన్ 'జ్ఞాన్'తో '400'కు తగ్గేదేలే! మోదీ, షాతో పాటు ఆ ఇద్దరు కూడా రంగంలోకి!