Bihar Road Accident News Today : బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆటో, లారీ పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. బాధితులు పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు పోలీసులు.
వివాహ వేడుకకు వెళ్లి వస్తూ!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- జిల్లాలోని లఖీసరాయ్-సికంద్రా ప్రధాన రహదారికి సమీపంలో బిహరౌరా గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు వెళ్లిన 15 మంది ఆటోలో తిరుగు ప్రయాణమవుతున్నారు. ఆ సమయంలో లారీ, ఆటో పరస్పరం ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
మరణించిన వారిలో వీర్ పాశ్వాన్, వికాస్ కుమార్, విజయ్ కుమార్, దిబానా పాస్వాన్, అమిత్ కుమార్, మోను కుమార్, కిసాన్ కుమార్, మనోజ్ గోస్వామి ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ముంగేర్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించినట్లు పోలీసులు చెప్పారు.
ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. లారీని స్వాధీనం చేసుకున్నామని, డ్రైవర్ పరారయ్యాడని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు అందించినట్లు చెప్పారు.
వధువు కుటుంబీకులు మృతి!
కొన్నిరోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ జిల్లాలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- జిల్లాలోని డేరాపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముర్రా గ్రామానికి చెందిన పంకజ్ కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు జరగాల్సిన క్రతువుల్లో భాగంగా వరుడి ఇంట్లో తిలక్ వేడుక ఘనంగా జరిగింది.
ఇటావాలో జరిగిన ఈ కార్యక్రమానికి పంకజ్ కుటుంబసభ్యులు కారులో వెళ్లి హాజరయ్యారు. ఎంతో ఆనందం గడిపిన వాళ్లు ఆదివారం రాత్రి తిరుగుపయనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వధువు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. సందల్పుర్ రోడ్డు సమీపంలోని జగన్నాథ్పుర్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బస్సు, ట్రక్కు ఢీ- 19 మంది మృతి, మరో 18 మందికి గాయాలు
రెండు లారీల మధ్య నలిగిపోయిన బైక్- భార్యాభర్తలు మృతి- చిన్నారులు సేఫ్