Bhole Baba Ashram Rules : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట తర్వాత భోలే బాబాకు సంబంధించి విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని ఆయన ఆశ్రమం గురించి పలు వివాదాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఖేడ్లీ పట్టణానికి సమీపంలోని సహజపుర్ గ్రామ శివారులో భోలే బాబా అలియాస్ నారాయణ్ సాకర్ హరికి విలాసవంతమైన ఆశ్రమం ఉంది. అయితే సుమారు 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ ఆశ్రమంలోని విషయాలు బయటకు తెలియకుండా ఆశ్రమం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు నిర్మించారు. ఆధునిక హంగులు, విలాసవంతమైన గదులతో నిండి ఉంటుందని అక్కడి గ్రామస్థులు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా స్థానిక గ్రామస్థులతో సహా ఎవరినీ లోపలికి అనుమతించరని చెప్పారు.
మహిళా భక్తులకు మాత్రమే!
ముఖ్యంగా భోలే బాబా ఆశ్రమంలో ఉన్న సమయంలో కేవలం మహిళా భక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, పురుష భక్తులకు, స్థానికులకు ప్రవేశం ఉండదని ఆ ఊరి ప్రజలు తెలిపారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే బాబా అనుచరులు దాడులు చేసేవారని వాపోయారు. ఈ దాడులను ఆశ్రమ వాసులు బాబా దీవెనలుగా సమర్థించుకునేవారని ఆరోపించారు. అయితే పదేళ్ల క్రితం ఆశ్రమం కోసం గ్రామస్థుల భూమిని భోలే బాబా కొనుగోలు చేశారని స్థానిక పంచాయితీ వార్డు మెంబరు పూల్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు.
కానీ బాబా ఉపన్యాసాలు, దీవెనల కోసం వెళ్లినప్పుడు ఆశ్రమవాసులు దాడులకు తెగబడేవారని వెల్లడించారు. బాబా అద్భుతాలు, అతీత శక్తుల గురించి ఆశ్రమ వాసులు చెప్పే మాటలను గ్రామస్థులెవరూ విశ్వసించేవారు కాదని అన్నారు. అయినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భోలే బాబాను దేవుడిగా కొలుస్తున్నారని చెప్పుకొచ్చారు.
భోలే బాబా ఆర్థిక సహాయం అందించాల్సిందే!
మరోవైపు, హాథ్రస్ తొక్కిసలాటలో మరణించిన 121 మంది కుటుంబాలకు భోలే బాబా ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల్లో ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మరణించిన వారి కుటుంబసభ్యులను కలిశానని, వారికి అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చానని తెలిపారు.