Bharat Ratna Award Winner 2024 : దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారతరత్న ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రకటించింది. వారిలో మాజీ ప్రధానులు చౌధరీ చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీ, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు.
వీరిలో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించింది. వారి కుటుంబ సభ్యులకు శనివారం ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకరరావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. మరో మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌధరీ, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యారావు, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ తరఫున ఆయన కుమారుడు రమేశ్‌నాథ్ ఠాకూర్ భారతరత్న పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అడ్వాణీ ఇంటికెళ్లి భారతరత్న ప్రదానం చేయనున్నారు.
పీవీ సేవలను ప్రతి భారతీయుడు గౌరవిస్తాడు : మోదీ
భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా మరణాంతరం అవార్డుల గ్రహీతలకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌధరీ చరణ్‌సింగ్‌తో పాటు ఇతరు ప్రముఖుల సేవలను కొనియాడారు. పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను ప్రతి భారతీయుడు గౌరవిస్తాడని, ఆయనకు భారతరత్న లభించినందుకు గర్వంగా భావిస్తారన్నారు. దేశ పురోగమనం, ఆధునీకరణ కోసం పీవీ ఎంతో కృషి చేశారన్న మోదీ, గొప్ప పండితుడిగా పేరు పొందారని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.
పీవీ నరసింహారావు
పీవీ నరసింహారావు 1921లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగానూ పనిచేశారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 మధ్య ప్రధానిగా పని చేశారు. ఈ సమయంలో 1992లో దేశంలో కీలక ఆర్థిక సంస్కరణలు చేపట్టారు. రాజనీతిజ్ఞుడిగా, పండితుడిగా, బహుబాషావేత్తగా పేరుపొందారు.
చౌదరి చరణ్ సింగ్
చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో 1902లో జన్మించారు. 1979 జులై 28 నుంచి 1980 జనవరి 14 వరకు భారత ప్రధానిగా పనిచేశారు. 1967, 1970లో ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా పనిచేశారు. చరణ్ సింగ్ రైతుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేశారు. చరణ్ సింగ్ తరఫున అతని మనవడు, రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) అధ్యక్షుడు జయంత్ చౌధరీ అవార్డును అందుకున్నారు.
కర్పూరి ఠాకూర్
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి దివంగత నేత, బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్. అణగారిన వర్గాల ప్రజల సాధికారత కోసం పనిచేసిన ప్రజల నాయకుడికి ఈ పురస్కారాన్ని ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు కర్పూరి ఠాకూర్ మనుమడు రామ్ నాథ్ ఠాకూర్. 1970వ దశకంలో రెండు సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ జన నాయక్(జననేత)గా గుర్తింపుపొందారు.
డాక్టర్ ఎమ్‌ఎస్ స్వామినాథన్
ఆకలి చావులను తరిమి కొట్టాలి, పేదరికాన్ని నిర్మూలించాలి అనే ఆయన సంకల్పమే ఆహార ధాన్యాల కొరతతో బాధపడే భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి చేర్చింది. ఆయనే భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎమ్‌ఎస్ స్వామి నాథన్. వ్యవసాయ రంగానికి ఆయన అందించిన విశేష సేవలకు భారతరత్న పురస్కారాన్ని అందించింది ప్రభుత్వం. ఎమ్ఎస్ స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు ఈ అవార్డును స్వీకరించారు.
ఎంపీ టు సీఎం- లోక్‌సభ నుంచి అసెంబ్లీకి జంప్- కీలక పదవుల్లో 16 మంది - Lok Sabha MP to MLA