Best Tips To Remove Holi Colours on Vehicles : దేశవ్యాప్తంగా మార్చి 25(సోమవారం) నాడు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రంగులతో ఆడుతున్నప్పుడు ఒంటిపై ఉన్న దుస్తువులు కలర్స్‌తో నిండిపోవడం కామన్. అలాగే, ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలపై కూడా హోలీ కలర్స్ పడుతుంటాయి. అయితే, వీటిని తొలగించే క్రమంలో కొందరు చేసే పొరపాట్ల కారణంగా వాహనాల పెయింట్ లేదా ఫినిషింగ్ పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి. దీంతో వాహనాలపై పడిన హోలీ కలర్స్ ఈజీగా తొలగిపోవడమే కాకుండా వాహనానికి ఎలాంటి హాని జరగదంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాటిని యూజ్ చేయకూడదు : హోలీ సందర్భంగా వాహనాలపై రంగులు పడడం సహజం. చాలా మంది వాటిని తొలగించడానికి కఠినమైన రసాయనాలు లేదా రాపిడి క్లీనర్లను యూజ్ చేస్తుంటారు. వాటిని ఉపయోగించకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అవి వాహనాల పెయింటింగ్‌కు నష్టం కలిగించే ఛాన్స్ ఉందట. దీనికి బదులుగా తేలికపాటి కార్ వాష్ సోప్ వంటి సున్నితమైన క్లీనింగ్ ఏజెంట్స్ వాడడం మంచిదని చెబుతున్నారు.
మీ వాహనంపై పడిన హోలీ రంగులను తొలగించే ముందు మొదటగా మీ వాహనాన్ని(కారు లేదా బైక్) నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాష్ సోప్‌ను అప్లై చేయాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అలా అప్లై చేశాక మృదువైన క్లాత్ లేదా స్పాంజ్ తీసుకొని నెమ్మదిగా స్క్రబ్ చేస్తూ వాటర్‌తో క్లీన్ చేశారంటే రంగు మరకలు ఇట్టే తొలగిపోతాయంటున్నారు నిపుణులు.
పెయింట్ ఫినిషింగ్ పోకుండా జాగ్రత్తలు : బైక్, స్కూటర్, కారు ఇలా ఏదైనా హోలీ మరకలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే వాహనం పెయింట్ లేదా ఫినిషింగ్ పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం కాస్త ఎక్కువ టైమ్ పట్టినా పర్వాలేదు కానీ, నెమ్మదిగా క్లీన్ చేసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. కలర్ పడిన వెంటనే క్లీన్ చేసుకోవడం బెటర్. ఎక్కువ రోజులు అలాగే ఉంచితే ఆ మరకలను తొలగించడం కష్టంగా మారతుంది.
మీ కారు నుంచి పొగ ఎక్కువగా వస్తోందా? - ఇలా చెక్ పెట్టండి!
ఓపికతో క్లీన్ చేసుకోవాలి : చాలా మంది వాహనాలపై కలర్స్ త్వరగా తొలగించాలని స్క్రబ్బింగ్ ప్యాడ్లు లేదా బ్రష్ వంటి వాటిని యూజ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పెయింట్‌పై స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. కొన్ని కఠినమైన మరకలను సున్నితంగా తొలగించడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. కాస్త ఓపికతో నెమ్మదిగా స్క్రబ్ చేస్తే సరిపోతుంది.
ఇక చివరగా మీ వాహనంపై పడిన హోలీ కలర్స్ మరకలన్నీ రిమూవ్ అయ్యాక మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే? వాహనం పెయింట్ ప్రకాశవంతంగా సురక్షితంగా మెరుస్తూ ఉండాలంటే వ్యాక్స్ లేదా పాలిష్ వంటి వాటిని అప్లై చేయాలి. ఇలా చేయడం ద్వారా ఫ్యూచర్లో ఎప్పుడైనా వాహనాలపై మరకలు, గీతలు పడినా నష్టం వాటిల్లకుండా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ టిప్స్ ఫాలో అయి మీ వెహికల్ క్లీన్ చేసుకున్నారంటే మీ వాహనం కొత్తదానిలా మెరిసిపోవడం ఖాయం అంటున్నారు నిపుణులు.