Bangladesh Political Crisis : బంగ్లాదేశ్‌లో జరుగుతున్నరాజకీయ అస్థిర పరిస్థితులను కేంద్రం నిశితంగా గమనిస్తోందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ పరిణామాలపై రాజ్యసభలో ఆయన ప్రకటన చేశారు. బంగ్లాలో మైనార్టీల వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు జులైలోనే స్వదేశానికి వచ్చేశారని చెప్పారు. ఢాకాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు.
"రాయబారమార్గాల ద్వారా బంగ్లాదేశ్‌లోని భారతీయసమాజంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. 9వేల మంది విద్యార్థులుసహా మొత్తం 19వేల మంది భారతీయులు అక్కడ ఉన్నారు. హైకమిషనర్ సూచన మేరకు చాలామంది విద్యార్థులు జులైలోనే స్వదేశానికి తిరిగివచ్చారు. ఢాకాలోని హైకమిషన్ తోపాటు చిట్టగాంగ్, రాజ్‌షాహీ, కుల్నార్, సిల్హేర్‌లో అసిస్టెంట్ హైకమిషన్‌లు ఉన్నాయి. వాటికి అక్కడి ప్రభుత్వం తగినంత భద్రత కల్పిస్తుందని ఆశిస్తున్నాం. మైనార్టీల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం." అని జై శంకర్ వెల్లడించారు.
భారత్ టెక్స్‌టైల్ రంగంపై ప్రభావం
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు భారత టెక్స్‌టైల్ రంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని ఇండియన్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్(CITI) మంగళవారం తెలిపింది. ముఖ్యంగా ఆ దేశంలో ఫ్యాక్టరీలను నిర్వహిస్తున్న కంపెనీలకు ఇబ్బందిగా మారిందని చెప్పింది. బంగ్లాదేశ్‌లో సప్లైకు ఇబ్బంది ఏర్పడితే భారత్‌లో సప్లై చైన్‌పై ప్రభావం పడుతుందని వెల్లడించింది. తద్వారా భారతీయ సంస్థల ప్రొడక్షన్ షెడ్యూల్‌లు, డెలివరీ టైమ్‌లైన్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది.