Ayodhya Shri Ram Hospital History : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయోధ్య. ఈ నగరానికి ఎంతో చరిత్ర ఉంది. శ్రీరాముడి జన్మస్థలం కావడం వల్ల హిందూ మతంలో ఈ నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఏళ్లుగా తమ బాగోగులు చూసుకోమని అయోధ్య వాసులు ఆ మర్యాద పురుషోత్తముడిని వేడుకుంటున్నారు! అయితే అదే అయోధ్యలో ఉన్న మరో శ్రీరాముడు పేదల సమస్యలు తీరుస్తున్నాడు! వారి వ్యాధులను నయం చేస్తున్నాడు. 120 ఏళ్లుగా అయోధ్య ప్రజల వెన్నంటి ఉంటున్నాడు. ఆయనే 'శ్రీరామ ఆస్పత్రి' రూపంలో ఉన్న శ్రీరాఘవుడు!
నాలుగు శతాబ్దాలుగా సేవలు
అయోధ్య నగరంలో ఈ 'శ్రీరామ ఆస్పత్రి' గత శతాబ్ద కాలానికి పైగా ప్రజలకు సేవలు అందిస్తోంది. నవనిర్మిత రామమందిరానికి దాదాపు కిలో మీటరు దూరంలో ఉంది. ఆస్పత్రిలో ఉన్న శాశనం ప్రకారం దీన్ని రసూల్పుర్కు చెందిన రాయ్ శ్రీరామ్ బహదూర్ అనే వ్యక్తి నిర్మించి ప్రజల కోసం దానం చేశారు. ఈ ఆస్పత్రికి ఫైజాబాద్ డివిజన్ కమిషనర్, ఐసీఎస్ (ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్ (బ్రిటీష్ ఇండియాలో)) జే హూపర్ 1900 నవంబర్ 5న శంఖుస్థాపన చేశారు. 1902 ఏప్రిల్ 12న కేసీఎస్ఐ, ఉమ్మడి ఆగ్రా & ఓధ్ ప్రావిన్స్ లెప్టినెంట్ గవర్నర్ హెచ్‌హెచ్ జేమ్స్ డిగ్స్ లటోచ్ ప్రారంభించారు.
వివిధ రకాల వైద్య సేవలు
ప్రస్తుతం ఈ ఆస్పత్రి వివిధ రకాల వైద్య సేవలు అందిస్తోంది. పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, డెంటిస్ట్రీ, ఆప్తాల్మాలజీ వంటి ఇతర విభాగాల్లో చికిత్స అందించడమే కాకుండా సాధారణ, అత్యవసర సేవలను అందిస్తున్నట్లు ఆస్పత్రి అధికారి ప్రకాశ్ సింగ్ చెప్పారు. ఈ అస్పత్రిని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని తెలిపారు.
"ఇంతకుముందు ఆస్పత్రి భవనం గులాబీ రంగులో ఉండేది. కానీ, రామ్‌పథ్‌లో ఉన్న భవనాలకు ఒకటే రంగు వేశారు. దీంతో ఆస్పత్రి ఇటీవల పసుపు రంగులోకి మారింది. ఆస్పత్రిలో ఉన్నప్పుడు, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అల్లకల్లోలమైన దశను చూశాను. అప్పుడు రామ్ లల్లా తాత్కాలిక ఆలయంలో ఉన్నారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కొత్త రామమందిరాన్ని చూశాను. కొత్త ఆలయం అయోధ్యకు ఆశీర్వాదం. మా ఆస్పత్రి క్యాంపస్ వెనుక వైపు సరిహద్దు, రామమందిరం ఆలయ సముదాయం ప్రాంతం సరిహద్దును తాగింది. దీంతో ఈ ఆస్పత్రి ఎల్లో సెక్యూరిటీ జోన్లో ఉంది"
--యశ్ ప్రకాశ్ సింగ్, శ్రీరామ ఆస్పత్రి అధికారి
ఆ వ్యక్తి పేరే ఆస్పత్రికి!
అయితే రామజన్మభూమికి దగ్గరగా ఉండటం వల్ల దీనికి శ్రీరామ్ ఆస్పత్రిగా పేరు వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని, అది శ్రీరామ్ అనే వ్యక్తి పేరు మీద వచ్చిందని ఆస్పత్రి అధికారి యశ్ ప్రకాశ్ సింగ్ తెలిపారు. అయితే ఆస్పత్రి రికార్డుల్లో దానిని నిర్మించిన బిల్డర్, లబ్ధిదారుని పేరు, ఆయన చేసిన సహాయాన్ని పేర్కొన్నారని, కానీ కట్టించిన వ్యక్తికి సంబంధిన పూర్తి వివరాలు లేవని సింగ్ వెల్లడించారు. ఈ విషయం పాత తరం వారికి మాత్రమే తెలుసునని అందుకే శ్రీరాముడి పేరు ఈ ఆస్పత్రికి పెట్టారని అందరూ అనుకుంటారని సింగ్ తెలిపారు.
పేదలకు కొత్త జీవితం
ఈ ఆస్పత్రికి అయోధ్య, ఫైజాబాద్ పట్టణాలు, బస్తీ జిల్లా నుంచి రోగులు వచ్చేవారని తెలిపారు. అయోధ్యలోని భగవాన్ రిషభదేవ్ కంటి ఆస్పత్రి కూడా దీనికి అనుబంధంగా సేవలు అందిస్తోందని చెప్పారు. అయితే అందరూ ప్రైవేటు ఆస్పత్రిగా అనుకునే ఈ శ్రీరామ్ దవాఖానా, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో సేవలు అందిస్తోందని ప్రకాశ్ సింగ్ వెల్లడించారు. ఈ ఆస్పత్రి ప్రారంభమైనప్పటి నుంచి అనేక మంది పేదలకు కొత్త జీవితం ప్రసాదించిందని చెప్పారు. ఇటీవల రామమందిర ప్రారంభమైన తర్వాత రామాలయ దర్శనానికి వచ్చి స్పృహ కోల్పోయిన ఓ భక్తుడికి కూడా ఈ శ్రీరామ ఆస్పత్రికి సేవలు అందించిందని తెలిపారు.
అయితే పలు చరిత్ర దస్త్రాల్లో ఈ ఆస్పత్రి గురించి పేర్కొన్నారు. 1905లో ప్రచురించిన 'యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా, ఔద్ డిస్ట్రిక్ట్ గెజిటీర్స్ సంపుటి XLIIIలో రాయ్ శ్రీరామ్ బహదూర్ పేరు ఉంది. 1960 ఫైజాబాద్ గెజిటీర్లో కూడా శ్రీరామ ఆస్పత్రి పేరు ప్రస్తావించారు. ఈ ఆస్పత్రిని నిర్మించిన రాయ్ శ్రీరామ్ బహదూర్ ప్రముఖ అడ్వొకేట్, అప్పట్లో రసూల్‌పుర తాలూకాదార్ అని పేర్కొన్నారు. 1902 ఏప్రిల్ 12లో ప్రారంభమైన ఈ ఆస్పత్రిని 1949లో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది.