Axis Bank Robbery In Bihar : బిహార్ అరారియాలో డీఎస్పీ అధికారి ఇంటి సమీపంలోనే బ్యాంకు చోరీ జరగడం కలకలం రేపింది. నగరంలోని ఏడీపీ చౌక్ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంకులోకి చొరబడి ఆరుగురు దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ.90 లక్షల నగదును దోచుకెళ్లారు. చోరీకి వచ్చిన సమయంలో దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. సమాచారం అందగానే రంగంలోకి దిగిన అరారియా ఎస్పీ అశోక్ కుమార్ సింగ్ సహా స్థానిక పోలీసులు- బ్యాంకుకు సీల్ వేశారు. లోపలికి వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు. ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగిందని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు.
"బ్యాంకులో అప్పుడే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆరుగురు వ్యక్తులు లోపలికి చొరబడ్డారు. కస్టమర్లను ఆయుధాలు చూపించి బెదిరించారు. కాల్పులు జరపగానే బ్యాంకులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. క్యాష్ కౌంటర్ నుంచి రూ.50 లక్షలు లూటీ చేసి వారు పారిపోయారు. బ్యాంకు మేనేజర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు."
-బ్యాంకు ఉద్యోగి
అయితే, రూ.90 లక్షల నగదు చోరీకి గురైందన్న విషయాన్ని ఎస్పీ అశోక్ కుమార్ సింగ్ నిర్ధరించలేదు. బ్యాంకు ఉద్యోగులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనాస్థలి నుంచి రెండు ఖాళీ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు మేనేజర్‌తో మాట్లాడి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని స్పష్టం చేశారు.
బిజీ కూడలిలో బ్యాంకు- అయినా వెనక్కి తగ్గని దొంగలు
కాగా, డీఎస్పీ స్థాయి అధికారి అయిన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఇంటికి 50 మీటర్ల దూరంలోనే బ్యాంకు ఉండటం గమనార్హం. నగరంలో అత్యంత బిజీగా ఉండే కూడలిలో బ్యాంకు ఉంది. అయినప్పటికీ నేరస్థులు చోరీకి పాల్పడే సాహసం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
డీఎస్పీ ఇంటి ముందు ఆఫీసులో చోరీ
పంజాబ్‌లోనూ అచ్చం ఇలాగే డీఎస్పీ అధికారి నివాసం ఎదుట దోపిడీ జరిగింది. తరన్ తారన్ జిల్లాలో మాస్కులు ధరించి వచ్చిన దుండగులు నగదు ట్రాన్స్ఫర్ చేసే కంపెనీని లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడ్డారు. ఉద్యోగుల తలకు తుపాకులు పెట్టి బెదిరించి రూ.7లక్షలు దోచుకెళ్లారు. ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన జరిగిందని చోరీకి గురైన ఏఎం రాయల్ కంపెనీ యజమాని అమృత్‌పాల్ సింగ్ తెలిపారు. 'నేను ఆఫీసులో ఉన్న సమయంలోనే ఇద్దరు దుండగులు మాస్క్ ధరించి లోపలికి వచ్చారు. తుపాకీలతో బెదిరించి రూ.7లక్షలు దోచుకెళ్లారు. వెళ్లే ముందు ఇక్కడి సీసీటీవీ కెమెరాలను విరగ్గొట్టారు' అని వివరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కిరాణ దుకాణంలో మహిళల చేతివాటం - 20 లీటర్ల నూనె డబ్బా చోరీ
నచ్చిన మగాడి కోసం ఎంతకైనా తెగిస్తాడు - ఏం దోచినా డైరీలో రాస్తాడు