Aurangabad Goat Theft Case : బిహార్‌లోని ఔరంగాబాద్ సివిల్ కోర్టు మేకల దొంగతనం కేసులో కీలక తీర్పు వెలువరించింది! 36 సంవత్సరాల సుధీర్ఘ విచారణ అనంతరం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా, ఏడుగురిలో ఇద్దరిని ఇప్పటికే నిర్దోషులుగా తేల్చింది. తాజాగా మరో ఐదుగురిని సైతం నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
అసలేం జరిగిందంటే?
అస్లెంపుర్ గ్రామంలో రాజన్ రాయ్ అనే వ్యక్తి ఇంట్లో 1988 జూన్ 25వ తేదీన తెల్లవారుజామున 5 గంటల సమయంలో దొంగలు పడ్డారు. ఇంటి ముందు కట్టి ఉంచిన రూ.600 విలువ చేసే రెండు మేకలను తీసుకుని వెళ్లారు. మేకల చోరీ విషయం తెలుసుకున్న రాజన్ ఇదే అంశంపై వారిని ప్రశ్నించాడు. దీంతో 12 మంది వ్యక్తులు రాజన్‌పై తిరగబడి దాడి చేశారు. ఇంటికి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో రాజన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే అంశమై రాజన్ 12 మందిపై దౌద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విచారణకు 36 ఏళ్లు!
రాజన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును చేపట్టారు. 12 మందిపై అభియోగాలు మోపారు. ఈ నేఫథ్యంలో 1988 నుంచి పలుమార్లు కోర్టులో విచారణ జరిగింది. కానీ కోర్టు ఇప్పటి వరకు కూడా ఎలాంటి తీర్పునివ్వలేదు. దీంతో ఆ కేసు పరిష్కరానికి సుమారు 36 సంవత్సరాలు పట్టింది. తాజాగా సివిల్ కోర్టు న్యాయమూర్తి సౌరభ్ సింగ్ 2024 సెప్టెంబర్ 9వ తేదీన తీర్పు వెలువరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు.
''నిర్దోషులుగా పేర్కొన్న వారిలో లఖన్ రాయ్, మదన్ రాయ్, విష్ణు దయాళ్ రాయ్, దీనదయాళ్ రాయ్, మనోజ్ రాయ్ ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు మరణించారు. ఇప్పటికే ఇద్దరికి ఈ కేసులో విముక్తి లభించింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఐదుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు. మేకల దొంగతనం వివాదంలో 1988లో 12 మందిపై కేసు నమోదైంది'' అని న్యాయవాది సతీశ్ కుమార్ స్నేహి తెలిపారు.
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసు.. 15ఏళ్ల తర్వాత తీర్పు.. ఐదుగురూ దోషులే..