JK Assembly Elections In September : జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబరులో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, అభివృద్ధిని కొనసాగించేందుకు బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. జమ్మూకశ్మీర్‌లో భాజపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూలో సోమవారం నిర్వహించిన ‘ఏకాత్మ మహోత్సవ్’ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
మరోవైపున జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాతో పాటు ప్రత్యేక ప్రతిపత్తిని తిరిగి కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, పీడీపీ విడివిడిగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ‘బ్లాక్ డే’గా పాటించాయి. పోలీసులు తమను గృహనిర్బంధంలో ఉంచారని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.
హై అలర్ట్
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం రద్దు చేసి నిన్నటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యంత అప్రమత్తతో వ్యవహరిస్తోంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇటీవల వరుస ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతాబలగాలను హై అలర్ట్‌లో ఉంచింది. దీనితో అమర్‌నాథ్ యాత్రను ఒక రోజు పాటు నిలిపివేశారు. అలాగే సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతేకాదు అదనపు భద్రతా సిబ్బందిని కూడా ఆ ప్రాంతానికి తరలించారు. తొలిసారి అసోం రైఫిల్స్‌ను ఈ ప్రాంతంలో మోహరించారు. చొరబాట్లు, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఆర్టికల్ 370 రద్దు
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కానీ ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అంతేకాదు ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ, శాశ్వతం కాదని తేల్చిచెప్పింది. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. దీని పట్ల జమ్మూకశ్మీర్‌లోని పలు వర్గాలు, ఉగ్రవాదులు దీనిపై తీవ్రవ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. దీనితో దేశ భద్రత దృష్ట్యా భారత సైనిక దళాలు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి.