Arvind Kejriwal Surrender At Tihar Jail : దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తిహాడ్ జైలులో లొంగిపోయారు. తాను నియంతృత్వానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పినందుకు జైలుకు వెళ్తున్నానని అంతకుముందు కేజ్రీవాల్ అన్నారు. దేశాన్ని కాపాడడం కోసమే తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని చెప్పారు. శనివారం విడుదలైన ఎగ్జిట్‌పోల్స్ బూటకమని పేర్కొన్నారు. తాను అవినీతికి పాల్పడ్డట్లు ఒక్క ఆధారం కూడా దొరకడం లేదని స్వయంగా ప్రధాని మోదీయే చెప్పారన్నారు. తప్పు చేసినట్లు సాక్ష్యాలు లేకున్నా తాను ఎవర్నైనా జైల్లో పెట్టించగలనని మోదీ సందేశం ఇచ్చారని ఆరోపించారు. తిహాడ్ జైలుకు వెళ్లేముందు దిల్లీలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు.
"లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం 21 రోజుల బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు. ఈరోజు నేను తిరిగి తిహాడ్ జైలుకు వెళ్తున్నాను. ఈ 21 రోజుల సమయంలో ఏ ఒక్క సెకన్ను నేను వృథా చేయలేదు. కేవలం ఆప్‌నకు మాత్రమే కాకుండా అనేక పార్టీల కోసం ప్రచారం చేశాను. ముంబయి, హరియాణా, యూపీ, ఝార్ఖండ్ ఇలా అనేక ప్రాంతాలకు వెళ్లాను. ఆప్ కన్నా దేశమే ముఖ్యం. నేను జైలుకు తిరిగి వెళ్తున్నాను. నేను కుంభకోణం చేసినందుకు జైలుకు వెళ్లడం లేదు. నియంతృత్వానికి వ్యతిరేకంగా నా గళాన్ని విప్పినందుకు వెళ్తున్నాను. అధికారం ఎప్పుడైతే నియంతృత్వంగా మారుతుందో అప్పుడు జైలే బాధ్యతగా మారుతుందని, జైలు నుంచే నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాలని భగత్ సింగ్ చెప్పారు. భగత్‌సింగ్ దేశాన్ని రక్షించేందుకు, స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు జైలుకు వెళ్లారు. మేం కూడా దేశాన్ని రక్షించేందుకు జైలుకు వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తే మళ్లీ ఎప్పుడు బయటకు వస్తానో నాకు తెలియదు. నన్ను జైల్లో ఏం చేస్తారో తెలియదు. భగత్‌సింగ్ ఉరికంబం ఎక్కాడు. నేను కూడా ఉరికంబం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాను."
--అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు సుప్రీంకోర్టు మే 10న 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ గడువు జూన్ 1న ముగియడం వల్ల కేజ్రీవాల్ తిరిగి జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.
అంతకుముందు కేజ్రీవాల్ తన నివాసంలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం భార్య సునితా కేజ్రీవాల్, ఆప్ నేతలు అతీశీ, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోత్ సహా ఇతర ముఖ్య నేతలతో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించారు. తర్వాత కన్నౌట్ ప్లేస్ ప్రాంతంలోని హనుమాన్ మందిరాన్ని తన భార్యతో కలిసి సందర్శించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్లి నాయకులను, కార్యకర్తలను కలుసుకున్నారు. అక్కడి నుంచి తిహాడ్ జైలుకు వెళ్లారు.
-
#WATCH | Delhi CM and AAP national convener Arvind Kejriwal, his wife Sunita Kejriwal and AAP leaders pay tribute to Mahatma Gandhi at Rajghat ahead of Arvind Kejriwal's surrender at the Tihar Jail at the end of his interim bail by Supreme Court to campaign for the Lok Sabha… pic.twitter.com/YRADGkbQqE
— ANI (@ANI) June 2, 2024
జూన్5 వరకు కస్టడీ
మరోవైపు తిహాడ్ జైలులో లొంగిపోయిన సీఎం కేజ్రీవాల్‌కు జూన్ 5 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫనెర్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరు పరచగా డ్యూటీ జడ్జీ సంజీవ్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
దీదీ, నవీన్‌కు షాక్- కేరళలో బీజేపీ బోణీ- కర్ణాటకలో కాషాయ రెపరెపలు! - Exit Poll 2024 Lok Sabha