Arvind Kejriwal Health Condition : దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తీహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు షుగర్ లెవెల్ పెరగడం వల్ల తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చినట్లు తీహాడ్ జైలు అధికారులు వెల్లడించారు. ఎయిమ్స్ వైద్యుల సలహా మేరకు ఇన్సులిన్ ఇచ్చినట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ 300కు పైగా ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. కేజ్రీవాల్‌ను చంపాలన్న కుట్రలో బీజేపీ ఉన్నట్లు ఇటీవల ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కావాలనే జైలు అధికారులు కేజ్రీవాల్‌కు చికిత్సను ఇవ్వడం లేదని, ఇన్సులిన్ కూడా నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్ కు జైలు అధికారులు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు గతంలో ఇన్సులిన్ అవసరం లేదని చెప్పిన జైలు అధికారులు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారని ఆప్ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
"గత 23 రోజులుగా అరవింద్ కేజ్రీవాల్ తీహాడ్ జైలులో ఉన్నారు. ఆయనకు షుగర్ స్థాయి 300 స్థాయిని దాటుతోంది. ఈ విషయాన్ని కేజ్రీవాల్ పదే పదే చెప్తున్నారు. అయినా సరే ఆయనకు ఇన్సులిన్ అవసరం లేదని జైలు అధికారులు తెలిపారు. కానీ ఇప్పుడు ఇన్సులిన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చెప్పిన మాట నిజమేనని, ఆయనకు ఇన్సులిన్ అవసరమని ఈరోజు స్పష్టమైంది. తీహాడ్ జైలులో ఇన్సులిన్ కోసం, చికిత్స కోసం ఎవరైనా కోర్టును ఆశ్రయించారా? కానీ కేజ్రీవాల్ మాత్రం చికిత్స కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ ఘటనతో బీజేపీ- కేంద్ర ప్రభుత్వ కుట్రలు బహిర్గతం అయ్యాయి. బీజేపీ ప్రభుత్వం కింద పనిచేస్తున్న కొందరు అధికారులు కేజ్రీవాల్‌కు ఉద్దేశపూర్వకంగా వైద్యసేవల్ని దూరం చేస్తున్నారు. ఇన్సులిన్ అవసరం లేకపోతే మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? ప్రపంచం మొత్తం వారిని శపిస్తుండటమే అందుకు కారణం "
--సౌరభ్ భరద్వాజ్, దిల్లీ మంత్రి
అసలేం జరిగిందంటే
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధుమేహ చికిత్సకు పెట్టుకున్న అభ్యర్థనను ఇటీవల తిహాడ్ జైలు అధికారులు నిరాకరించారు. దీనిని నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు జైలు ఎదుట నిరసన చేపట్టారు. ఇన్సులిన్, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇన్సులిన్ ఇవ్వకుండా, వ్యక్తిగత వైద్యుడితో సంప్రదింపులకు అవకాశం కల్పించకుండా కావాలనే కేజ్రీవాల్‌ను నెమ్మదిగా మరణం వైపునకు నెడుతున్నారని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ చక్కెర స్థాయి 300 దాటినట్లు ఆప్ కార్యకర్తలు తెలిపారు. ప్రపంచంలో ఏ వైద్యున్ని అడిగినా షుగర్ లెవల్ 300 దాటితే, ఇన్సులిన్ వాడకుండా దాన్ని అదుపు చేయలేమని చెప్తారని దిల్లీ మంత్రి అతిశీ తెలిపారు. బీజేపీ ఆదేశాల మేరకు తీహాడ్ యంత్రాంగం పని చేస్తోందని ఇలాంటి క్రూరత్వం బ్రిటిష్ పాలనలో కూడా జరగలేదని అతిశీ మండిపడ్డారు. ఈ ఆరోపణల మధ్య తిహార్ జైలు అధికారులు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.