Arvind Kejriwal ED Case : మద్యం కుంభకోణం కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏడోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్ల ప్రకారం సోమవారం ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. అయితే తాను హాజరుకావడం లేదని సీఎం కేజ్రీవాల్ ఈడీకి సమాచారం ఇచ్చారు. కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావడం ప్రస్తుతం కోర్టులో ఉన్న అంశమనీ, దర్యాప్తు సంస్థ న్యాయ ప్రక్రియను గౌరవించాలని ఈ సందర్భంగా ఆప్ పేర్కొంది. పదే పదే సమన్లు జారీ చేయడం సరికాదని, కోర్టు ఆదేశాలు వెలువడే వరకు ఓపికతో వేచి ఉండాలని కోరింది.
ఏడుసార్లు సమన్లు- ఒక్కసారీ హాజరుకాని కేజ్రీ
మద్యం కుంభకోణం కేసులో విచారించేందుకు ఈడీ అనేకసార్లు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్‌కు గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 19న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. చివరగా ఫిబ్రవరి 22న ఏడోసారి సమన్లు పంపించింది. కానీ ఆయన ఒక్కసారి కూడా హాజరు కాలేదు. అయితే ఎంతకూ ఆయన విచారణకు హాజరుకాకపోవడం వల్ల ఈడీ కొన్ని రోజుల కోర్టును ఆశ్రయించింది. ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయగా- కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.
అరెస్ట్ ఖాయం : ఆప్
అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమ నాయకుడు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీకి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ అరెస్ట్ కోసం దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగించుకుంటోందని అన్నారు. ఈడీతో పాటు సీబీఐని సైతం ఇందుకోసం వాడుకుంటోందని ఆరోపించారు. అరెస్ట్‌కు సంబంధించి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు కూడా సిద్ధమయ్యాయని తమకు సమాచారం అందిందని చెప్పుకొచ్చారు.
రాజకీయ పార్టీపై కూడా పరువునష్టం కేసు వేయొచ్చు : కర్ణాటక హైకోర్టు
INLD పార్టీ అధ్యక్షుడిపై కాల్పులు- నఫే సింగ్ సహా అనుచరుడు మృతి