Cabinet Ministers Of India : ఎన్డీఏ సారథ్యంలో కేంద్రంలో మూడోసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, 71మంది మంత్రులకు తన కేబినెట్‌లో చోటు కల్పించారు. వారిలో కొందరు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రివర్గంలో అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచిపేరు తేవటమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు కేంద్ర మంత్రులు తెలిపారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్, కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా, MSME శాఖ మంత్రి జితిన్‌రాం మాంఝీ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాసవాన్, జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్, శాస్త్ర సాంకేతిక, పీఎంవో శాఖ మంత్రి జితేంద్రసింగ్, సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి, ఎరువులు, రసాయనాలు శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి బాధ్యతలు చేపట్టారు.
12న గడ్కరీ, రామ్మోహన్ బాధ్యతల స్వీకారం
కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. మంత్రివర్గంలోని 71మందిలో 30మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్రహోదా కలిగిన సహాయ మంత్రులు, మరో 36మంది సహాయమంత్రులు ఉన్నారు. ప్రధాని మోదీ వారికి సోమవారం సాయంత్రం శాఖలు కేటాయించారు. రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్, అశ్వినీ వైష్ణవ్ తదితరులు గత ప్రభుత్వంలో నిర్వహించిన శాఖలనే ఈసారి కూడా పొందారు.