Amit Shah slams Rahul Gandhi : జాతి వ్యతిరేక మాటలు మాట్లాడటం, దేశాన్ని ముక్కలుగా చేసే శక్తులకు మద్దతివ్వడం కాంగ్రెస్‌కు, రాహుల్‌గాంధీకి అభిరుచిగా తయారైందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా ఈ మేరకు ఎక్స్‌వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
'దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్, కాంగ్రెస్‌కు అలవాటుగా మారింది. జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చేస్తున్న దేశవ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాలకు మద్దతిచ్చినా, విదేశీ గడ్డపై భారత్ వ్యతిరేక ప్రకటనలైనా సరే, ఆయన దేశభద్రత, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తునే ఉన్నారు. ప్రాంతీయత, మతం, భాషల ఆధారంగా దేశాన్ని చీల్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్‌గాంధీ ప్రకటన బయటపెట్టింది. రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడం ద్వారా వాటిపై కాంగ్రెస్ వ్యతిరేకతను మరోసారి మనముందుంచారు. ఆయన మనసులో మెదిలే ఆలోచనలే చివరకు మాటల రూపంలో బయటపడ్డాయి. ఇక్కడ నేను రాహుల్‌కు ఒక విషయం స్పష్టంచేయాలని అనుకుంటున్నాను. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అలాగే దేశభద్రతతో చెలగాటమాడలేరు' అని అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
'బీజేపీకి ఎవరూ భయపడట్లేదు'
అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పలు ప్రసంగాలు చేశారు. ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. 'ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. భారత్‌లో ఇప్పటికీ నిష్పక్షపాత పరిస్థితులు లేవు. ఆ రోజులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి మేము ఆలోచిస్తాం. మీడియా, దర్యాప్తు ఏజెన్సీలతో ప్రజలను ఒత్తిడికి గురిచేసి, బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ భయాన్ని వ్యాప్తి చేశారు. కానీ, ఎన్నికల తర్వాత అదంతా మారిపోయింది. ఇప్పుడు బీజేపీని చూసి ఎవరూ భయపడట్లేదు. భారత్‌లో అన్ని రాష్ట్రాలు సమానమేనన్న ఆలోచనను ఆర్‌ఎస్‌ఎస్ అర్థం చేసుకోలేకపోతోందన్నారు' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇలా రాహుల్ గాంధీ దేశాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.