Amit Shah On Ram Mandir : అయోధ్యలో బాలక్‌రామ్ ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22వ తేదీ వేల సంవత్సరాల పాటు చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. శ్రీరాముడు లేని భారత్‌ను ఊహించుకోలేమని అన్నారు. లోక్‌సభలో రామ మందిర నిర్మాణంపై చర్చ సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. రామమందిర నిర్మాణానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని షా చెప్పారు.
"రామ మందిర ఉద్యమం లేకుండా ఈ దేశంలో ఏ ఒక్కరూ చరిత్రను చదవలేరు. 1528 నుంచి ప్రతి తరం ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమాన్ని చూసింది. ఐదు శతాబ్దాల పాటు జరిగిన ఈ సుదీర్ఘ పోరాటానికి తెర పడింది. అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లౌకికవాదాన్ని చాటిచెప్పింది. దేశం కలలుగన్న అయోధ్య ఆలయం మోదీ ప్రభుత్వ హయాంలో సాకారమైంది. ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రధాని 11 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష చేపట్టారు" అని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు.
ప్రతిపక్షాలపై షా ఫైర్!
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు అమిత్ షా. "జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ నవ భారత ప్రయాణానికి నాంది. శ్రీరాముడి లేని భారతాన్ని ఊహించుకునేవారికి మన దేశం గురించి పూర్తిగా తెలియదు. వారు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) ఇంకా వలసవాద రోజుల్లోనే ఉన్నారు. చరిత్ర గురించి తెలుసుకోని వారికి ఎలాంటి గుర్తింపు ఉండదు" అని అమిత్ షా అన్నారు.
ఎయిర్‌పోర్టుకు శ్రీరాముడి పేరు పెట్టాలని!
అయోధ్యలో నిర్మించిన ఎయిర్‌పోర్టుకు శ్రీరాముడి పేరు పెట్టాలని చాలా ప్రతిపాదనలు వచ్చాయని అమిత్ షా తెలిపారు. కానీ ప్రధాని మోదీ మాత్రం మహర్షి వాల్మీకి పేరును సూచించారని చెప్పారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పించేందుకు మోదీ ఎల్లప్పుడూ కృషి చేస్తారని కొనియాడారు.
'రామరాజ్యం ఎలా అవుతుంది?'
దేశంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నప్పుడే అది రామరాజ్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దేశంలో అణగారిన, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు సంతోషంగా ఉన్నారా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. దళితులపై నేరాలు పెరుగుతున్నాయని, విద్య, ప్రభుత్వోద్యోగాల్లో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని, మహిళా రెజ్లర్ల రోదనలు మిన్నంటాయని, మరి అలాంటప్పుడు ఇది రామరాజ్యం ఎలా అవుతుందని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయీ నిలదీశారు.
జై శ్రీరామ్ నినాదాలు ప్రేమ, సద్భావన పెంపొందించాలనీ అయితే భారతీయ జనతా పార్టీ చేసే జైశ్రీరామ్ నినాదాలు విద్వేషం, ఆగ్రహాలను నింపుతున్నాయని గొగొయీ మండిపడ్డారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను పూజించే సంస్కృతి పోవాలని ఆకాంక్షించారు. రాముడు అందరివాడని, అందరితో అన్ని సమయాల్లో ఉంటాడని వివరించారు. గుండెల్లో ద్వేషాన్ని నింపుకున్న వాడు ఎప్పటికీ రామభక్తుడు కాలేడన్నారు. ద్రవ్యోల్బణం, అసహనం, హింస నుంచి దృష్టి మరల్చడానికే బీజేపీ ఇలా చేస్తుందన్నారు. కాంగ్రెస్ అన్ని మతాలకు సమగౌరవం ఇస్తుందని చెప్పారు.
'సార్వత్రిక ఎన్నికలకు ముందే CAA అమలు, ఆర్టికల్ 370 రద్దుతో 370 సీట్లు పక్కా'
'ఆర్టికల్ 370 శాశ్వతమంటే రాజ్యాంగాన్ని అవమానించినట్లే- సరైన సమయంలో హోదా పునరుద్ధరిస్తాం'