Amit Shah On Modi : 2029 వరకు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆ తర్వాత కూడా ఆయన తమను నడిపిస్తారని చెప్పారు. ఇది దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బ్యాడ్ న్యూస్ వంటిదని అన్నారు. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు విషయంలో ఇచ్చిన తీర్పు సాధారణమైనది కాదని తెలిపారు. ఇప్పుడు ఆయన మరో కేసులో ఇరుక్కుపోయారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మైనారిటీ ఓటు బ్యాంకుకు భయపడి!
మైనారిటీ ఓటు బ్యాంకుకు భయపడి ఘమండియా(పొగరబోతు) కూటమి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకను బహిష్కరించిందని ఆరోపించారు. "ఈద్ రోజు మీరు ముస్లిం సోదరులతో ఈద్ జరుపుకోవడానికి, ఖర్చు చేయడానికి మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు హిందువులు అయినప్పటికీ రామమందిరప్రాణ ప్రతిష్ఠకు హాజరుకాలేదు? ముస్లిం ఓటు బ్యాంకు దెబ్బతింటుందని అలా చేశారు. ఇది ఎలాంటి రాజకీయం?" అని అమిత్ షా ప్రశ్నించారు.
రాహుల్ చేసింది సరి కాదు!
దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని తెలిపారు అమిత్ షా. కానీ రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు తాను 2 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పి ఉండాల్సిందని, ప్రజాస్వామ్య కోణంలో దాన్ని దాచిపెట్టడం సరికాదని అన్నారు. "వయనాడ్ ప్రజలకు మీరు ముందే చెప్పాల్సింది. ఆ తర్వాత వారిని ఎంపిక చేసుకోవాలని కోరాల్సింది. పోస్ట్ పోల్ సర్వేలో మీకు ముప్పు ఉందని తెలిసి రాయ్‌బరేలీకి వచ్చారు. అది సరైనది కాదు" అని అమిత్ షా వ్యాఖ్యానించారు. అమిత్ షా ఇంటర్వ్యూలోని మరికొన్ని ప్రశ్నలు- సమాధానాలు మీకోసం.
ప్రశ్న: మథురలో కృష్ణ జన్మభూమి, కాశీలో జ్ఞానవాపి స్థానంలో విశ్వనాథ ఆలయ నిర్మాణం, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి ఎన్డీఏకు 400 సీట్లు కావాలని అసోం సీఎం ఎందుకు అంటున్నారు?
అమిత్ షా: పీఓకే విషయానికొస్తే ఇది బీజేపీ నిబద్ధత మాత్రమే కాదు, దేశ పార్లమెంట్ నిబద్ధత కూడా. పీఓకే భారత్‌లో ఒక భాగం, దానిపై మనకు అధికారం ఉంది. దానిని ఎవరూ కాదనలేరు. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయి. వారిని గౌరవించండి, పీఓకే డిమాండ్ చేయవద్దని ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వాళ్లను నేను అడగాలనుకుంటున్నాను. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ అణుశక్తికి భయపడి తన హక్కును వదులుకుంటుందా? పాకిస్థాన్‌ను గౌరవించండంటూ ఇండి కూటమి నేతలు ఏం చెప్పదలుచుకున్నారో రాహుల్ బాబా దేశానికి వివరించాలి. పీఓకేను వదులుకోవాలా? అది ఎప్పటికీ జరగదు. పీఓకేలో నిర్వహణ లోపం ఉంది. మంచి పరిపాలన లేదు. అది వారి సబ్జెక్ట్ కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది ఎందుకంటే మొత్తం కశ్మీర్ ఇండియన్ యూనియన్‌లో కలిసిపోయింది. ఆ హక్కును ఎలా తీసుకోవాలనేది భారత్ ముందున్న సవాల్.
-
#WATCH | On PoK, Union HM Amit Shah says, "As far as PoK is concerned, it is not only the commitment of the BJP but also the commitment of the Parliament of the country. PoK is a part of India and we have rights over it. No one can deny that...Farooq Abdullah and Congress leaders… pic.twitter.com/KpSVz7LpAj
— ANI (@ANI) May 15, 2024
ప్రశ్న: 400 స్థానాలే లక్ష్యమని మీరు నినదిస్తున్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికే ఈ నినాదం ఇచ్చారని విపక్షాలు అంటున్నాయి. ముస్లింల హక్కులు, ముస్లిం రిజర్వేషన్లు లాక్కొవడానికే బీజేపీ యత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారి వాదన క్షేత్రస్థాయికి చేరింది.
అమిత్ షా: మేం దేశ ప్రజలకు ఇప్పటికే చాలా స్పష్టం చెప్పాం. రిజర్వేషన్లు రద్దు చేయాలి అనేదే మా ఉద్దేశం అయితే పదేళ్లుగా మాకు మెజార్టీ ఉంది. కానీ మేము రిజర్వేషన్లు రద్దు చేయలేదు. ఇక ముస్లిం రిజర్వేషన్ల విషయానికి వస్తే మతం ఆధారంగా ఈ దేశంలో రిజర్వేషన్లు ఉండరాదనేదే మా అభిప్రాయం. రాజ్యాంగంలో కూడా మతపరమైన రిజర్వేషన్లు లేవు. రాజ్యాంగం అందుకు అంగీకరించదు. భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వదు.
ప్రశ్న: దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మీరు అన్నారు. దక్షిణాదిలో బీజేపీ ఖాళీ అవుతుందని, ఉత్తరాదిన బీజేపీకు సగం సీట్లు తగ్గుతాయని విపక్షాలు అంటున్నాయి.
అమిత్ షా: నా ప్రకటనకు నేను కట్టుబడి ఉన్నాను. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి ఎన్ని స్థానాలు ఉన్నాయో వాటిలో ఎక్కువ స్థానాలు నెగ్గి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది.
- b" class="align-text-top noRightClick twitterSection" data="b">b
ప్రశ్న: భారత ఎన్నికల్లో విదేశీ జోక్యంపై మీకు ప్రశ్న అడుగుతున్నాను. ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే దేశం నియంతృత్వం దిశగా సాగుతుందని విదేశీ పత్రికలు అనేక కథనాలు ప్రచురించాయి.
అమిత్‌షా: విదేశీ మిత్రులు మనకోసం అంత ఎక్కువగా చింతించాల్సిన పని లేదు. మన దేశం ఎంతో పరిణతి చెందినది. మన ఓటర్లు పరిణతి చెందినవారు. ఈ దేశంలో ఎన్నో గొప్ప మార్పులు ఒక్క రక్తం చుక్క కూడా పడకుండా జరిగాయి. మన దేశంలో ప్రజలు ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. భారత్‌లో నియంతృత్వం ఎప్పటికీ రాదు.
ప్రశ్న: యూసీసీ అజెండాలో ఉందా లేదా?
అమిత్ షా: మా సంకల్ప్ పత్రలో ఇది కచ్చితంగా ముఖ్యమైన అంశం. యూసీసీని తీసుకువస్తాం. దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నికలను కూడా తీసుకురావాలనుకుంటున్నాం. దీనిపై కూడా చర్చ జరగాలి. రాబోయే రోజుల్లో వ్యక్తిగత చట్టాలు రావడానికి మేము అనుమతించబోం.