American woman PUBG love : పబ్జీ ఆడుతూ ప్రేమలో పడి భారత్‌కు వచ్చింది సీమా హైదర్ పాకిస్థానీ మహిళ. ఇప్పుడు అలాగే మరో యువతి ప్రేమ కోసం అమెరికా నుంచి ఏకంగా ఇండియాకు వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాకు చేరింది. అయితే ఓ విదేశీ యువతి అనుమానాస్పదంగా కనిపించిందన్న స్థానికుల సమాచారంతో ప్రేమికులిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పబ్జీలో మొదలైన ప్రేమ
పబ్జీ ఆడుతూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇటావా నివాసి హిమాన్షు యాదవ్‌తో స్నేహం చేసింది అమెరికాలో ఫ్లోరిడా నివాసి బ్రూక్లిన్(30). ఇద్దరి మధ్య ఆటలు, మాటలు పెరిగి స్నేహం ప్రేమగా మారింది. హిమాన్షు కోసం కొన్ని నెలల క్రితం చండీగఢ్ చేరుకుంది బ్రూక్లిన్. ప్రియురాలిని కలవడానికి హిమాన్షు కూడా చండీగఢ్ వెళ్లాడు. వివాహం చేసుకుని అక్కడ కొద్ది రోజులు గడిపిన తరువాత హిమాన్షు, బ్రూక్లిన్ని తన సొంత ఊరు అయిన ఎటావాకు తీసుకొచ్చాడు.
అనుమానించిన స్థానికులు
తమ ఊరికి వచ్చిన విదేశీ వనితను చూసి స్థానికులు ఆశ్చర్యపోవడం కంటే అనుమానించడం ఎక్కువ అయ్యింది. దీంతో ఇద్దరు తిరిగి చండీగఢ్ వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే స్థానికులు ఒక విదేశీ అమ్మాయిని హిమాన్షు తనతో బలవంతంగా తీసుకెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇద్దరు ఆర్టీసీ బస్సు ఎక్కగా, బస్సు కండక్టర్, ఇంకా డ్రైవర్ కూడా అదే విధంగా అనుమాన పడ్డారు. విషయం ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ పరశురామ్ పాండేకు చెప్పారు. ఆర్ ఏం ఆదేశాలతో డ్రైవరు బస్సును సరాసరి పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయాడు.
యువతి అంగీకారంతోనే
అప్పటికే ఈ విషయంలో అప్రమత్తంగా ఉన్న పోలీసులతో పాటు నిఘా విభాగం అధికారులు బ్రూక్లిన్, హిమాన్షు లను ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హిమాన్షుతో కలిసి వెళ్లేందుకు అమ్మాయి ఇష్టపూర్వకంగా అంగీకారం తెలిపినట్టుగా తెలిసిందని రూరల్ ఎస్పీ విజయ్ సింగ్ వెల్లడించారు. యువతి తన పూర్తి అంగీకారంతోనే హిమాన్షుతో కలిసి దిల్లీ మీదుగా చండీగఢ్ వెళ్లాలనుకుంటోందని చెప్పారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.