Allam Charu Making Process : ఈ వర్షాకాలంలో మారిన సీజన్ కారణంగా.. దాదాపుగా ప్రతిఒక్కరూ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుంటారు. మరికొందరు చలితో వణికిపోతుంటారు. ఇలాంటి వారికి కాస్త ఘాటు ఘాటుగా ఏదైనా చారు ఉంటే.. వేడి వేడి అన్నంలో వేసుకొని నాలుగు ముద్దలు చక్కగా తినే అవకాశం ఉంటుంది. జ్వరం వంటివి లేనివారైతే జుర్రేస్తారు. అందుకే.. మీకోసం అద్దిరిపోయే అల్లం చారు రెసిపీ తీసుకొచ్చాం. మరి, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ రెసిపీ చేసుకోండి.. హాట్ హాట్ గా ఆరగించండి.
అల్లం చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
1. నిమ్మకాయంత సైజు చింతపండు
2. రెండు టమాటాలు..
3. మూడు ఇంచుల అల్లం
4. వెల్లుల్లి రెబ్బలు 10
5. రెండు ఎండు మిర్చీలు
6. ఒక స్పూన్ ధనియాలు
7. చిటికెడు మెంతులు
8. ఒకటిన్నర స్పూన్ జీలకర్ర
9. ఒక స్పూన్ మిరియాలు.
10. కరివేపాకు రెండు రెమ్మలు
తయారీ విధానం..
ఒక బౌల్ తీసుకొని చింతపండు అందులో వేసి, కొన్ని నీళ్లు పోసుకొని బాగా పిసకండి. ఆ తర్వాత టమాటాలను కూడా అలాగే పిసకండి. ఇప్పుడు చక్కగా పిప్పిని తీసివేసి, రసం వేరే బౌల్లో పోయండి. మిగిలిన పిప్పిలో మరికొన్ని నీళ్లు పోసి, మరోసారి పిసికితే ఇంకా రసం వస్తుంది. దాన్ని కూడా తీసుకోండి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చీ, ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు అందులో వేసి.. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
తర్వాత ఒక పాన్ స్టౌమీద పెట్టి, అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయండి. హీటెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 ఎండు మిర్చీలు, హాఫ్ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేయండి. ఫ్లేమ్‌లో సిమ్‌లో ఉంచి.. మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమం అందులో వేయండి. సరిగ్గా ఒక్క నిమిషం వేగనివ్వండి. దీనివల్ల పచ్చివాసన పోతుంది. కావాలనుకుంటే కాస్త ఇంగువ వేసుకోవచ్చు.
పచ్చివాసన పోయిందని నిర్ధారించుకున్న తర్వాత.. ఓసారి మొత్తం గరిటతో కలుపుకొని, చింతపండు పులుసు అందులో పోయాలి. ఇప్పుడు పులుపు మీకు తగినంత ఉందో లేదో చూసుకోండి. ఎక్కువైతే.. మీకు తగినన్ని నీళ్లు పోసుకోవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం వేయాలి. కారం వద్దు అనుకునేవాళ్లు వేసుకోకపోయినా పర్వాలేదు.
ఇలా.. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత సరిగ్గా 3 పొంగులు వచ్చే వరకు పొయ్యిమీద ఉంచి తర్వాత దించుకోవాలి. ఎక్కువగా మరిగితే దాని అసలైన టేస్ట్ పోతుంది. కాబట్టి.. మూడు పొంగులు రాగానే దించేయండి. ఇప్పుడు సన్నగా కత్తిరించుకున్న కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అద్దిరిపోయే అల్లం చారు ఘాటుఘాటుగా.. వేడి వేడిగా గొంతులోకి జారిపోతుంటే.. వహ్వా అనాల్సిందే. ఇందులో.. కొందరు బెల్లం వేసుకుంటారు కావాలనుకునే వారు వేసుకోవచ్చు.
ఇవీ చదవండి :
5 నిమిషాల్లో అద్దిరిపోయే మిరియాల చారు - సీజనల్ జ్వరాలకు సూపర్ రెమిడీ!
చిటపట చినుకుల వేళ స్పైసీ స్పైసీ "పుదీనా చారు"- ఇలా ప్రిపేర్ చేస్తే తినడమే కాదు తాగొచ్చు కూడా!