Akhilesh Yadav Offer To BJP MLAs : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంలో అంతర్యుద్ధం కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అధికార పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలకు మాన్‌సూన్ పేరుతో బంఫర్ ఆఫర్ ఇచ్చారు. యూపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ నుంచి బయటకు రావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పరోక్షంగా కోరారు. వంద మంది ఎమ్మెల్యేలను తెచ్చుకొని కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు.
ఆయనను ఉద్దేశించే పోస్ట్!
అయితే అఖిలేశ్ తన పోస్టులో ఏ బీజేపీ నాయకుడి పేరు ప్రస్తావించలేదు. కానీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో విభేదిస్తున్న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను ఉద్దేశించి అఖిలేశ్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2022లో జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ 111 స్థానాలు గెలిచింది. బీజేపీలోని వంద మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే తాము సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలమని అఖిలేశ్ పేర్కొన్నారు.
ఎవరూ గొప్ప కాదు!
గత ఆదివారం జరిగిన యూపీ బీజేపీ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పార్టీ కంటే ఎవరూ గొప్పకాదంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలను గౌరవించాలని మౌర్య సూచించారు. రెండు రోజుల క్రితం దిల్లీ వెళ్లిన కేశవ ప్రసాద్ మౌర్య పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీకి సంబంధించిన వివరాలను బీజేపీ కానీ, ఆయన కానీ వెల్లడించలేదు.
యోగి వల్లే!
ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులతోపాటు యూపీకి చెందిన బీజేపీ నేతలు సీఎం యోగి పని తీరుపై విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోవడానికి సీఎం యోగి వ్యవహార శైలి ఓ కారణమనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. యూపీలో 80 సీట్లకు గాను బీజేపీ 33 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.