Actor Vijay Political Party : తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు విజయ్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయమని, ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వమని తెలిపారు. విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పారు.
-
#தமிழகவெற்றிகழகம் #TVKVijay https://t.co/Szf7Kdnyvr
— Vijay (@actorvijay) February 2, 2024
"ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చా. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయబోదు. ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం. పార్టీ జెండా, అజెండాను త్వరలో ప్రకటిస్తాం" అని విజయ్ వెల్లడించారు.
"తమిళ ప్రజలు నాకు చాలా ఇచ్చారు. నేను ఇప్పుడు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నా. మా నాన్న, అమ్మ, పేరు, ప్రఖ్యాతి, డబ్బుతో సహా అన్నీ నాకు అందించింది తమిళ ప్రజలే. అది వారికి తిరిగి ఇవ్వాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఈసీలో పార్టీని నమోదు చేసేందుకు మా పార్టీ నేతలు దిల్లీకి వెళ్లారు. ఇక నేను సైన్ చేసిన సినిమాల్లో మరొకటి పెండింగ్ ఉంది. దాన్ని పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల్లోకి వస్తాను. నా రాజకీయ ప్రయాణానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. తమిళనాడు ప్రజలకు నేను అంకితం" అని విజయ్ తెలిపారు.
తమిళనాట సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్‌డమ్ ఉన్న నటుడు విజయ్. అభిమానులు దళపతి అని ముద్దుగా పిలుస్తుంటారు. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు. ప్రతిభ చూపిన పదోతరగతి, ప్లస్‌వన్, ప్లస్‌టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టంచేయడం వల్ల విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేశారు.
అందులో భాగంగానే విజయ్ మక్కల్ ఇయక్కం(అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై రాజకీయ పార్టీపై సుదీర్ఘ చర్చలు జరిపారు. తమిళగ మున్నేట్ర కళగం పేరుతో ఆయన పార్టీని స్థాపిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. దీనికి స్వల్ప మార్పులు చేసి తమిళగ వెట్రి కళగం పేరును ఖరారు చేశారు.
తెలుగు చిత్రాల ప్రభావమే!
తమిళ సూపర్ స్టార్ తర్వాత అంతటి స్టార్ డమ్ వచ్చింది విజయ్‌కే. అయితే దళపతికి ఆస్థాయి స్టార్‌డమ్ రావడం వెనుక తెలుగుచిత్రాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ కెరీర్‌లో పోక్కిరి, గిల్లి, బద్రి, ఆది, వేలాయుధం, యూత్ వంటి సినిమాలు ముఖ్యమైనవి. కెరీర్‌ను మలుపుతిప్పాయి కూడా. ఇవన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. పవన్‌కల్యాణ్‌ను ఎక్కువగా అనుకరించేవారు. ఆయన పాటలు, సినిమాలను రీమేక్ చేశారు. తమిళంలో అభిమానులకు ప్రాధాన్యం ఇస్తుంటారు.