ABPMJAY Scheme Beneficiaries : ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్'(AB-PMJAY) పథకం కింద ప్రయోజనం పొందే లబ్దిదారుల సంఖ్యను వచ్చే మూడేళ్లలో రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అలాగే 70ఏళ్లు పైబడిన వారిని ఈ పథకం కిందకు తీసుకురావాలని, ఆరోగ్య బీమా కవరేజీని ఏడాదికి రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నేషనల్ హెల్త్ అథారిటీ లెక్కల ప్రకారం, ఈ ప్రతిపాదనలు ముందుకు సాగితే ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.12,076 కోట్ల భారం పడుతుందని అంచనా.
వైద్య ఖర్చులు చాలా కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని, ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధిదారులను రెట్టింపు చేస్తే, దేశంలోని మూడింట రెండొంతులకు పైగా జనాభాకు ఆరోగ్య రక్షణ కల్పించొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, త్వరలో కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీనికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ పథకం కోసం కేటాయింపులను రూ.7,200 కోట్లకు పెంచింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్(PM-ABHIM) కోసం రూ.646 కోట్లు కేటాయించింది.
'70ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్యం'
ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, 70ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆరోగ్య బీమా కిందకు తీసుకురానున్నామని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత చికిత్స అందించనున్నామని తెలిపారు. 70ఏళ్లు పైబడిన వారితో కలిపి ఈ పథకం కింద మరో 4-5కోట్ల మంది లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రస్తుతం దేశంలో 20శాతం మంది సామాజిక ఆరోగ్య బీమా, ప్రైవేటు స్వచ్ఛంద ఆరోగ్య బీమా కింద ఉన్నారు. 30శాతం మందికి ఆరోగ్య బీమా కవరేజీ లేదని 2021లో నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది. PMJAYలో ఇప్పటికే ఉన్న కవరేజీ అంతరాలు, పథకాల ఓవర్‌ల్యాప్ కారణంగా అసలు సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలిపింది. ఆరోగ్య బీమా కవరేజీ లేనివాళ్లలో అన్ని రకాల ఆదాయ వర్గాల వారు ఉంటారని తెలిపింది. అందులో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందే(వ్యవసాయం, వ్యవసాయేతర) అసంఘటిత రంగం వారు, పట్టణ ప్రాంతాల్లో ఇన్ఫార్మల్, ఫార్మల్, సెమీ-ఫార్మల్ వృత్తుల వారు ఉన్నారని నివేదిక వెల్లడించింది. వీరి కోసం తక్కువ ధరలో సమగ్ర ఆరోగ్య బీమా రూపొందించాల్సిన అవసరాన్ని ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.
జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా 2018 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం. 12 కోట్ల కుటుంబాలకు రూ.5లక్షల వరకు వైద్యం అందించేందుకు ఉద్దేశించింది.