AAP DP Campaign For Kejriwal : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ ఆందోళనల కార్యక్రమాలు చేస్తోంది. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తాము సాగిస్తున్న పోరాటంలో ప్రజల మద్దతు కోరుతూ సోషల్ మీడియా 'డీపీ క్యాంపెయిన్'ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆప్ మంత్రి ఆతిశి దిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ నేతలు, వాలంటీర్లంతా సోషల్ మీడియా వేదికలు ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సప్‌లో కేజ్రీవాల్ కస్టడీలో ఉన్న ఫొటోను డిస్‌ప్లేలో మార్చుకుంటారని తెలిపారు. ప్రజలు సైతం ఈ క్యాంపెయిన్‌లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ జైలులో ఉన్నట్లుగా చూపించే ఆ ఫొటోపై 'మోదీకి అతిపెద్ద భయం కేజ్రీవాల్' అని రాసి ఉంటుందని చెప్పారు.
అయితే ఈ నిరసన కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలుకాగా, ఆప్ నేతలు, కార్యకర్తలు తమ డీపీలు మార్చుకొంటున్నారన్నారని ఆతిశి తెలిపారు. ఈ క్యాంపెయిన్‌లో పాల్గొని తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోను డిస్‌ప్లే చేయాలని కోరారు. దేశంలో మోదీని సవాల్ చేయగల నేత కేజ్రీవాల్ ఒక్కరేనని అన్నారు. అందుకే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎలాంటి ఆధారాల్లేకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయించారని ఆమె ఆరోపణలు గుప్పించారు.
కేజ్రీవాల్‌ను బీజేపీ తప్పుడు కేసుల్లో ఇరికించి, ఈడీని ఉపయోగించి జైలుకు పంపించిందన్నారు ఆతిశి. ఈ కేసులో ఈడీ రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా, ఒక్క పైసాకు సంబంధించిన ఆధారాలు కూడా సంపాదించలేకపోయిందని చెప్పారు. బీజేపీ, మోదీ కేజ్రీవాల్‌ను అణిచివేయాలని చూస్తున్నారని, దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆప్ యుద్ధం చేస్తోందని అన్నారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు మార్చి 21న రాత్రి అరెస్టు చేశారు. అనంతరం ఈనెల 28 వరకు ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించింది.
లాకప్‌లో కంప్యూటర్, పేపర్ లేదు- కేజ్రీ ఆదేశాలు ఎలా జారీ చేశారు!
ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారంటూ ఆప్ మంత్రి ఆతిశీ మార్లీనా ఆదివారం విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలంటూ ఓ కాగితం ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని చెబుతోంది. దీంతో ఆ ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆ కాగితం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొనేందుకు ఆప్ మంత్రి ఆతిశిని దర్యాప్తు సంస్థ ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో పాటు జైల్లో కేజ్రీవాల్ కదిలికలను గమనించేందుకు సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలించవచ్చని తెలుస్తోంది.
ఆరు భాషల్లో అశ్విని రాజకీయం- బీజేపీ ఎంపీ అభ్యర్థిగా స్కూల్ టీచర్ - BJP Multi Lingual Candidate