Survey On Five Govt Guarantee Schemes In Karnataka : కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన ఐదు గ్యారెంటీలు అమలు విజయవంతంగా జరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏడాదిగా ప్రభుత్వం వీటిని అమలు చేస్తోంది. అయితే గృహ జ్యోతి, శక్తి యోజన, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి వంటి పథకాల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి? ఆ పథకాలను ఎంత శాతం మంది వినియోగించుకుంటున్నారు? మొదలైనవాటిపై కర్ణాటక సర్కార్ సర్వే చేయించింది. అందులో పథకాల లబ్దిదారులు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటంటే?
గృహ జ్యోతి : కర్ణాటకలోని ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించే పథకం గృహ జ్యోతి. ఈ పథకం ఏడాదిగా రాష్ట్రంలో అమలవుతోంది. ఈ పథకంపై 45శాతం లబ్ధిదారులపై సర్వే పూర్తయ్యింది. మరో 55శాతం మందిపై సర్వే చేయాల్సి ఉంది. అయితే సర్వేలో పాల్గొన్న 45శాతం మంది లబ్దిదారుల్లో 98శాతం మంది గృహ జ్యోతి స్కీమ్ తమ జీవితాలను మెరుగుపరిచిందని అభిప్రాయపడ్డారు. ఈ పథకం వల్ల తమ డబ్బు ఆదా అవుతోందని 33శాతం మంది చెప్పారు. చదువుకోవడానికి గృహ జ్యోతి పథకం ఉపయోగపడుతుందని 29శాతం మంది చెప్పుకొచ్చారు.
గృహ లక్ష్మి : గృహ లక్ష్మి పథకం కింద కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000 అందిస్తారు. ఈ పథకం కింద 63శాతం మందికి సర్వే పూర్తైంది. మరో 37 శాతం మందిని చేయాల్సి ఉంది. తమకు వచ్చిన రూ. 2,000లో 43శాతం డబ్బును పండ్లు, కూరగాయలను కొనడానికి మహిళలు ఉపయోగిస్తున్నారు. 13శాతం పిల్లల పాఠశాల విద్యకు వినియోగిస్తున్నారు. కాగా, 23శాతం మంది గృహ లక్ష్మి స్కీమ్ కింద వచ్చిన డబ్బును ఇంటి ఖర్చులకు వాడుతున్నారు. 15 శాతం మంది వైద్యం కోసం ఉపయోగిస్తున్నారు.
శక్తి : కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం అందించే స్కీమ్ శక్తి. ఈ పథకాన్ని 98 శాతం మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. 94శాతం మంది ఈ పథకం బాగుందని ప్రశంసించారు.
అన్న భాగ్య : అన్న భాగ్య స్కీమ్ కింద దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ప్రతి నెల 10 కిలోల బియ్యం ఇస్తారు. ఈ పథకం లబ్దిదారుల్లో 73శాతం మందిని సర్వే చేశారు. మరో 27శాతం మందిని సర్వే చేయాల్సి ఉంది. బియ్యంతో పాటు పప్పులు, నూనె తదితర ఆహార పదార్థాలను ప్రభుత్వం అందజేస్తే బాగుంటుందని సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది లబ్దిదారులు ప్రభుత్వానికి సూచించారు.
యువ నిధి : ఈ స్కీమ్ కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ప్రతి నెల రూ.3,000 భృతి, డిప్లోమా ఉండి ఉద్యోగం లేని వారికి ప్రతి నెల రూ.1,500 అందిస్తోంది ప్రభుత్వం. యువ నిధి పథకం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని 73శాతం యువత అభిప్రాయపడింది.
మార్చి 1 నుంచి మార్చి 15 వరకు ప్రభుత్వం ఈ సర్వేను చేసింది. ఇందుకోసం 72,435 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 42,417 మంది ఆశా వర్కర్లు, 2,233 మంది బీబీఎంపీ సర్వేయర్లు, 581 మంది నగర, పంచాయతీ రాజ్ సర్వేయర్లు పాల్గొన్నారు. మొత్తం 84,52,317 కుటుంబాలు, 5 కోట్ల మందిని అధికారులు సర్వే చేశారు.
'గృహ ఆరోగ్య యోజన' అమలుకు కర్ణాటక సర్కార్ ప్లాన్
ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంటింటికీ వైద్య సేవలు అందించాలని భావిస్తోంది. ఈ మేరకు 'గృహ ఆరోగ్య యోజన' స్కీమ్ అమలుకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే గృహ జ్యోతి, గృహ లక్ష్మి పథకాలు అమలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఇంటి వద్దకు వైద్యుడిని పంపి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం 'గృహ ఆరోగ్య యోజన' పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కొద్ది నెలల క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు ఎనిమిది జిల్లాల్లో గృహ ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది.
గృహ ఆరోగ్య స్కీమ్ అనేది వైద్య బృందం ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సమస్యను గుర్తించి ఉచితంగా మందులను అందించే పథకం. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.96 కోట్లను కేటాయించింది. బీపీ, షుగర్ ఉన్నవారికి 3 నెలలకు సరిపడా 90 మాత్రల బాక్సును ఒకేసారి అందిస్తారు. ఈ మాత్రలను 30 ఏళ్లు పైబడిన వారికే మాత్రమే ఇస్తారు. సోమ, బుధ, శుక్రవారాల్లో తనిఖీ బృందం 20 ఇళ్లను సందర్శించనుంది. ఈ సమయంలో నోరు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించడానికి స్క్రీనింగ్ చేస్తుంది. క్యాన్సర్ నిర్ధరణ అయితే ఆస్పత్రులకు చికిత్స కోసం సిఫారసు చేస్తారు.
అంబానీలా మజాకా - పెళ్లి భోజనాల మెనూ చూస్తే కళ్లు తిరగాల్సిందే! - Anant Ambani Wedding Menu
పూరీ శ్రీమందిర్ రత్న భాండాగారం తెరచుకునేది అప్పుడే! - Puri Srimandir Ratna Bhandar