కొత్త లోక్‌సభ కొలువుదీరింది. సోమవారం ఉదయం 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభం కాగా ప్రొటెంస్పీకర్‌గా ఎన్నికైన భర్తృహరి మహతాబ్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రమాణం చేయించారు. అక్కడి నుంచి లోక్‌సభకు చేరుకున్న ప్రొటెమ్ స్పీకర్ సభ ప్రారంభం కాగానే తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభలోని మిత్రపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. విపక్ష ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతులను ఊపారు.
తర్వాత ప్రొటెం స్పీకర్ లోక్‌సభలో సీనియర్ నేతలైన రాధామోహన్‌సింగ్, ఫగ్గన్‌సింగ్ కులస్తేలతో ముందుగా ప్రమాణం చేయించారు. తర్వాత కేంద్ర కేబినేట్ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌చౌహాన్, మనోహర్‌లాల్ కట్టర్ తదితరులు ప్రమాణం చేశారు. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేస్తున్న సమయంలో విపక్ష ఎంపీలు నీట్-నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తర్వాత కేంద్ర సహాయ మంత్రులు, మిగిలిన నేతలు 18వ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఆంగ్లం, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.
ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్‌ను నియమించినందుకు నిరసనగా ప్రమాణ స్వీకారం ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యుడు కొడికున్నిల్ సురేష్, డీఎంకే ఎంపీ బాలు, TMC ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ సభ నుంచి వాకౌట్ చేశారు. 280 మంది ఎంపీలు తొలిరోజు ప్రమాణ స్వీకారం చేయగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా మిగిలిన సభ్యులు మంగళవారం ప్రమాణం చేయనున్నారు. జూన్ 26న లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్ లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.