Donkey Farm in Yadadri Bhuvanagiri District : చదువు పూరైన తర్వాత ఉద్యోగ అన్వేషణ అనేది అందరూ చేసే పనే. అందరిలా మనం చేస్తే అందులో కిక్కు ఏముంది అనుకుంది ఆ యువతి. ఉద్యోగం అనే రోటిన్ పద్దతికి స్వస్తి చెప్పి భిన్నంగా ఆలోచించింది. నలుగురికి ఉపాధి కల్పిస్తే ఎలా ఉంటుందని భావించి, వ్యాపారం వైపు అడుగులు వేసింది. అది కూడా అలాంటి ఇలాంటి వ్యాపారం కాకుండా వినూత్నంగా డాంకీ ఫామ్ ప్రారంభించింది. గాడిద పాలు(Donkey Milk) విక్రయిస్తూ లక్షల్లో ఆదాయం పొందుతోంది. చదువుకుంటూనే వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తూ యువ వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం సింగరాయచెర్వు గ్రామానికి చెందిన భూమిక. భూమిక ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ శ్రేయాస్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ప్రజలకు వచ్చే రకరకాల అనారోగ్య సమస్యలను గాడిద పాలు నయం చేస్తున్నాయని భూమిక తెలుసుకుంది. కరోనా సమయంలో గాడిద పాలు బాగా ఉపయోగపడ్డాయని, గాడిదల ఫామ్ ఏర్పాటు చేస్తే పాల విక్రయంతో పాటు అంతరించిపోతున్న ఆ జాతిని అభివృద్ధి చేయవచ్చని ఆ యువతి అనుకుంది. ఫలితంగా ప్రకృతికి, ప్రజలకు మేలు చేయడమే కాకుండా ఆదాయం అందుకోవచ్చని ఫామ్‌ను ఏర్పాటు చేసింది.
ఆరంభంలో ఒడిదొడుకులు : గాడిదల పెంపకం(Donkey Farm) వాటి సంరక్షణ గురించి వివిధ ప్రదేశాల్లో తిరిగి, నిపుణుల అభిప్రాయాలను భూమిక తీసుకున్నట్లు తెలుపుతుంది. గాడిదలు కొనుగోలు చేసి, అనుభవం లేకపోవడంతో ఆరంభంలో సమస్యలు వచ్చాయని వాపోయింది. అయినా ధైర్యంగా ముందడు వేసింది. తమిళనాడులోని డాంకీ ప్యాలెస్ గురించి తెలుసుకుని వారితో ఒప్పందం చేసుకున్నట్లు చెబుతోంది. ప్రస్తుతం 40 గాడిదలతో వ్యాపారం చేస్తున్నట్లు ఆమె చెప్పింది.
'గాడిదల ఫామ్' పెట్టిన గ్రాడ్యుయేట్.. ఏటా కోట్ల ఆదాయం.. లీటరు పాలు ఎంతంటే..
"పాలను బాటిల్స్‌లో పెట్టి కోల్డ్ స్టోరేజ్ చేస్తాం. సాధారణంగా ఈ పాలు ఏడాది పాటు నిల్వ ఉంటాయి. ఈ పాలను నెలకు ఒకసారి తమిళనాడు డాంకీ ప్యాలెస్‌కి పంపిస్తాము. లీటర్ ధర రూ.1600. నెలకు 600 లీటర్లు వరకు పాలను సరఫరా చేస్తున్నాము. ఖర్చులన్నీ పోనూ నెలకి రూ.3 లక్షలు ఆదాయం అందుతుంది." - భూమిక, కనకదుర్గ డాంకీ ఫామ్ యజమాని
Bhumika From Yadadri : కొత్తగా డాంకీ ఫామ్ ప్రారంభించాలనుకునే వారికి కూడా తగిన సలహాలు, సూచనలను కనకదుర్గ డాంకా ఫామ్ యజమాని భూమిక ఇచ్చారు. తన ఫాం ద్వారా పలువురికి ఉపాధి కల్పిస్తున్నట్లు, అటు వ్యాపారం పరంగా, ఇటు ఆరోగ్యపరంగా నలుగురికి ఉపయోగపడుతుంటే సంతృప్తిని ఇస్తోందని హర్షం వ్యక్తం చేశారు.సామాజిక మాధ్యమాల్లోన ఫామ్‌కు మంచి స్పందన వస్తోందని ఈ యువ వ్యాపార వేత్త చెబుతోంది.
Kanaka Durga Donkey farm in Yadadri : భూమిక డాంకీ ఫామ్ వ్యాపారంపై ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి ముగ్గురి ఆడపిల్లలను వారి ఆలోచనలకు అనుగుణంగానే ప్రోత్సహించామని చెప్పారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరమైనా వెనుకడుగు వేయకుండా అందించామని భూమిక తల్లిదండ్రులు తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడటం అవి రాలేదని బాధపడటం మానేసి మనకు ఉన్న దానిలో చిన్న వ్యాపారం ప్రారంభిస్తే పది మందికి ఉపాధి కల్పించే స్థితికి చేరుకోవచ్చని వ్యాపారవేత్త భూమిక అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వినూత్న వ్యాపారలను ప్రోత్సహించి లోన్, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తే బాగుంటుందని ఆ యువతి అభిప్రాయపడుతుంది.
Donkey Farm : గాడిదల ఫామ్.. తెలంగాణలో తొలిసారి.. ఐడియా అదిరిందిగా..
గాడిద పాలతో ఆరోగ్యానికి రక్ష.. కానీ ధరనే కొండెక్కింది! ఎంతో తెలుసా?