ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా - 120 క్షిపణులు, 90 డ్రోన్లతో భీకర దాడి!
Published : 6 hours ago
Russia Ukraine War Updates : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీస్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడులు చేసింది. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌వ్యాప్తంగా 120 క్షిపణులు, 90డ్రోన్లతో రష్యా బలగాలు భీకర దాడులు చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రాజధాని కీవ్‌తో సహా పలు ప్రాంతాలపై రష్యన్ బలగాలు దాడులు జరిపినట్లు చెప్పారు. రష్యన్ బలాగాలు జరిపిన దాడుల్లో వివిధ రకాల డ్రోన్లు, ఇరాన్ తయారు చేసిన షాహెద్‌లతో పాటు క్రూయిజ్, బాలిస్టిక్, ఎయిర్‌క్రాఫ్ట్-లాంఛ్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని వెల్లడించారు. వీటిల్లో చాలా డ్రోన్లు, క్షిపణులను తమ బలగాలు విజయవంతంగా కూల్చివేసినట్లు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ దాడుల్లో పలువురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో విద్యుత్ కేంద్రాలు కూడా కొంతమేర ధ్వంసమైనట్లు వివరించారు. ఈ ఏడాది ఆగస్టు తర్వాత రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని జెలెన్‌స్కీ వెల్లడించారు.