అమెరికాలో 'హెలీన్ హరికేన్' భారీ విధ్వంసం - 44 మంది మృతి
Published : Sep 28, 2024, 6:32 AM IST
|Updated : Sep 28, 2024, 7:12 AM IST
Hurricane Helene Updates :అమెరికాలో హెలీన్ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో విరుచుకుపడ్డ తుపాను ధాటికి ఇప్పటి వరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడా, దక్షిణ జార్జియా సహా మొత్తం ఆగ్నేయ అమెరికా అంతటా అపార ఆస్తి నష్టం వాటిల్లింది. ఫ్లోరిడా, జార్జియా పరిసర ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు వందల మందిని పడవల సాయంతో రక్షించి సురక్షిత శిబిరాలకు తరలించాయి. ఉత్తర కరోలినాలో వరదలు పోటెత్తి కార్లు కొట్టుకుపోయాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. అట్లాంటా బక్‌హెడ్ పరిసరాల్లో పీచ్‌ట్రీ క్రీక్ ఉద్ధృతి పెరగడంతో స్థానికులు ఇళ్లు ఖాళీ చేయాల్సివచ్చింది. వాల్‌డోస్టాలో హెలీన్ ఈదురుగాలుల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. పైకప్పులు కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగవడంతో ఫ్లోరిడా, టంపా, సెయింట్‌పీట్, లేక్‌లాండ్, తల్లాహస్సీలోని విమానాశ్రయాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.