'అయోధ్య రామమందిరంలో చుక్క నీరు లీకేజీ లేదు'- శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ క్లారిటీ
Published : Jun 27, 2024, 10:29 AM IST
Champat Rai on Ram Mandir Leakage : అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి, పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లు వస్తున్న ఆరోపణలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తోసిపుచ్చారు. గర్భగుడిలో ఎలాంటి లీకేజీలు లేవని, ఒక్క చుక్క నీరు కూడా కారడం లేదని అన్నారు. 'కరెంట్ కేబుల్స్ కోసం పెట్టిన పైపులను మూసివేయకపోవడం వల్ల అందులో నుంచి నీరు కారుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఆలయంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొదటి, రెండు అంతస్తులకు వెళ్లేందుకు మాత్రమే మెట్లు నిర్మించాం. మొదటి అంతస్తులో నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి. రెండో అంతస్తు పైకప్పు నిర్మాణం పూర్తయితే ఆలయం లోపలికి నీళ్లు రావు' అని చంపత్ రాయ్ పేర్కొన్నారు.
అయితే శనివారం భారీ వర్షం పడటం వల్ల గర్భగుడిలోకి వర్షం నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సోమవారం తెలిపారు.