'వైఎస్సార్సీపీ నాయకులు ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారు' - జనసేన నేతలకు బాధితుల ఫిర్యాదు - YSRCP Victims at Janasena Program - YSRCP VICTIMS AT JANASENA PROGRAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 7:17 AM IST
YSRCP Victims at Janasena Program: ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు, అరాచకాలకు బలైపోయిన వారు జనసేన వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి జనసేన నేతలకు వినతులు సమర్పించారు. మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్‌ల పేర్లు చెప్పి టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేశారని విజయవాడకు చెందిన మహిళ జనసేన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
సుమారు 40మంది నుంచి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తమకు డబ్బు ఇప్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం నాగలూరులో తన 5 ఎకరాల భూమిని చిన్నాన్నతో కలిసి వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేశారని పల్లపు మంజునాథ జనసేన పార్టీ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2024 జనవరిలో పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్లకు సంబంధిన పోస్టులను తీయడంలోనూ తమకు అన్యాయం చేశారని బాధితులు వాపోయారు.