ఎన్నికల కోసం పాత్రికేయులకు ప్రలోభాలు- కొనసాగుతున్న వైసీపీ నేతల తాయిలాలు - YCP Distributing Gifts in NTR
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 9:52 AM IST
YSRCP Leaders Distributing Gifts TO Media Representatives in NTR District : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని వర్గాలను వివిధ రూపాల్లో ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు చేస్తున్న యత్నాలు అన్నీ, ఇన్నీ కావు. ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ తాయిలాలు పంపిణీ చేశారు. జిల్లాలో అనర్హత వేటుకు గురైన గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. గతంలో సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు సెల్‌ఫోన్లు, పాస్టర్లకు గిప్ట్‌లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మీడియా ప్రతినిధులను కూడా ఆకట్టుకునేందుకు ఫ్యాంట్, షర్ట్, చీర పంపిణీ చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమకు సహకరించాలని మీడియా వారిని కోరుతూ ఏవైనా పొరపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా షర్ట్, ప్యాంట్, చీర ఇతర దుస్తులను పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే వంశీ తన అనుచరులతో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి వైసీపీ నాయకులు ఓటర్లుకు తాయిలాలు పంపిణీ చేయడాన్ని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.